అక్కినేని నవ మన్మథుడు అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేసేందుకే చాలా టైం తీసుకున్నాడు. అప్పుడెప్పుడో 2019లో వచ్చిన మిస్టర్ మజ్ను తర్వాత వెయిట్ చేసి చేసి మరీ బ్యాచిలర్ సినిమా చేశాడు. ఈ సినిమా ఎలాగోలా బాక్సాఫీస్ దగ్గర పాస్ అయిపోయింది. తొలి మూడు సినిమాలు ఘోరంగా నిరాశపరిచినా బ్యాచిలర్ ఇచ్చిన హిట్‌తో అఖిల్ ఎట్టకేలకు తొలి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అఖిల్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. స్టైలీష్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బడ్జెట్ లిమిట్ దాటిపోయిందని కూడా తెలుస్తోంది.
అయితే సినిమా క్వాలిటీగా వచ్చేందుకు అఖిల్ తన రెమ్యునరేషన్ సైతం త్యాగం చేశాడని కూడా అంటున్నారు. తనకు రెమ్యునరేషన్ అవసరం లేదని.. సినిమా విషయంలో రాజీ పడవద్దని నిర్మాతకు చెప్పేశాడట. అందుకే నిర్మాతలు కూడా క్వాలిటీకి రాజీపడకుండా.. ఖర్చుకు వెనుకాడకుండా ఏజెంట్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా ఫినిష్ చేసుకుంది.
ఈ సినిమాలో ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ చాలా హాట్‌గా ఉండబోతోందట. ఆమె ఎవరో కాదు జాతిరత్నాలు సినిమాతో పాపులర్ అయిన ఫరియా అబ్దుల్లా. వీళ్లిద్దరి కాంబినేషన్లో మాస్ సాంగ్ అంటే థియేటర్లలో మామూలుగా ఉండదు. ఈ సినిమా కోసం అఖిల్ బాగా కండలు పెంచి నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ప్రముఖ మళయాళ నటుడు ముమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సక్సెస్‌ను అఖిల్ ఏజెంట్‌తో కంటిన్యూ చేస్తే అతడికి కొన్నాళ్ల పాటు తిరుగు ఉండదు.