తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి ఎల్లలు దాటించేసింది. బాహుబలి 1 రు. 600 కోట్లు కలెక్షన్ చేస్తే.. బాహుబలి 2 ఏకంగా రు. 1800 కోట్లు కొల్లగొట్టింది. బాహుబలి 1 2015లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ నెల 10వ తేదీతో 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో రాజమౌళి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న సినిమాలో బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తుంది.
అయితే ముందుగా ఇంటర్వెల్ సీన్‌ను మహిష్మతి ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు.. బాహుబలి తిరిగి వచ్చాడు అన్న డైలాగ్ దేవసేన చెప్పినప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే బాహుబలి ఫిగర్ వస్తున్నప్పుడు ఇంటర్వెల్ వేయాలని ముందుగా అనుకున్నారట. దీనికంటే ముందే శివుడు పంచభూతాలు అయిన నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం ఇలా పలు దశలు దాటుకుంటూ మహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. అయితే ఈ సీన్లను ముందుగా ఇలా తీయాలని రాజమౌళి అనుకోలేదట.
శివుడు మహిష్మతిలోకి వచ్చే ముందు మంచుకొండల్లో సైనికులతో పోరాటం చేస్తాడు. అప్పుడు ఓ సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుని ప్రభు మీరు నన్ను ఏమీ చేయవద్దని వేడుకుంటాడు.. అప్పుడు ఆ సైనికుడు తప్పించుకుని వెళ్లి బిజ్జలదేవుడికి అసలు విషయం చెపుతాడు. అప్పులు బిజ్జలదేవుడు బాహుబలి చచ్చిపోయాడు.. వాడి ప్రాణాలు మట్టిలో కలిపేశాం అన్న వెంటనే శివుడు పక్కనే ఉన్న మట్టిగోడను బద్దలు కొట్టుకుంటూ రావాలి.
వాడి ప్రాణాన్ని మంటల్లో కలిపేశాం అనగానే.. పక్కనే ఉన్న అగ్నికీలల్లో నుంచి శివుడు వచ్చేలా ప్లాన్ చేశారు. ఇలా బిజ్జల దేవుడు ఒక్కో డైలాగ్ చెపుతుంటే.. ఆ దశలను దాటుకుంటూ శివుడు లోపలకు రావడం.. బిజ్జలదేవుడు, భల్లాలదేవుడు అది చూసి షాక్ అయ్యే సీన్ వద్ద ఇంటర్వెల్ వేద్దాం అనుకున్నారట. అయితే ఇక్కడ బిజ్జలదేవుడి డైలాగులు అన్నీ తీసేసి.. విగ్రహం పైకి లేసే సీన్ దగ్గరే ఇంటర్వెల్ వేశారు.
బాహుబలిలో మిస్ అయిన కోతీ సీన్…
బాహుబలి 1లో శివుడుతో పాటు కోతిని కూడా పెట్టాలని కూడా రాజమౌళి అనుకున్నారట. జలపాతం దగ్గర శివుడు కొండను దూకేందుకు ఓ కొమ్మను పట్టుకుని ముందు పడిపోతాడు. కాని కోతి మాత్రం ఆ కొండ దూకేసి వెళ్లిపోయి కొద్ది రోజులకు నగల మూటతో కిందకు వస్తుందట. అది చూసే శివుడు అవంతిక రూపాన్ని చెక్కుతాడట. అయితే కోతితో సీన్ తీయడం అడవి జంతువులను ఇబ్బంది పెట్టే సెక్షన్ కిందకు వస్తుందట.
కోతిని కొన్ని సీన్లలో సీజే చేసినా.. కొన్ని సీన్లలో నిజమైన కోతిని పెట్టాల్సిందే అట. అమెరికా నుంచి ఓ ట్రైన్డ్ కోతిని రప్పించాలని కూడా రాజమౌళి ప్లాన్ చేశారట. అయితే కోతి ఎక్కడ నుంచి వచ్చినా నిబంధనలు ఒక్కటే అని సెన్సార్ వాళ్లు చెప్పడంతో రాజమౌళి అప్పుడు కోతి సీన్లు విరమించుకుని.. అవంతిక మాస్క్ ఐడియాను రాజమౌళి డెవలప్ చేశాడట.