మన టాలీవుడ్ హీరోలు ఎన్ని ప్లాపులు పడ్డాయన్నది కాదు.. ఒక్క హిట్ పడితే చాలు రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్నారు. కుర్ర హీరోలు, మీడియం రేంజ్ హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక్క హిట్ వస్తే అస్సలు రెమ్యునరేషన్ విషయంలో ఎవ్వరికి దొరకడం లేదు. ఉదాహరణకు రవితేజకు క్రాక్‌కు ముందు ఎన్ని ప్లాపులు రాలేదు.. క్రాక్ తర్వాత కూడా ప్లాపులే పడ్డాయి. అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రు. 20 కోట్లకు పైనే ముక్కుపిండి వసూలు చేస్తున్నాడని అంటున్నారు.
పైగా ఇటీవల రోజుకు కోటి రూపాయల చొప్పున కూడా కాల్షీట్లు ఇస్తున్నాడట. ఇక మహేష్‌బాబు, పవన్ రెమ్యునరేషన్లు రు. 55 కోట్ల పై మాటే. ఎన్టీఆర్, చరణ్ కూడా త్రిబుల్ ఆర్ దెబ్బతో రు. 50 కోట్లు క్రాస్ అయ్యారు. వరుణ్‌తేజ్, నాని లాంటి వాళ్లే రు. 12 – 15 కోట్లు తీసుకుంటున్నారు. అయితే సీనియర్ హీరో బాలయ్య మాత్రం అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ పడినా రెమ్యునరేషన్ పెంచడం లేదు.
అఖండకు ముందు బాలయ్య రెమ్యునరేషన్ రు. 8 కోట్ల రేంజ్‌లో ఉండేది. అయితే ఇప్పుడు మలినేని గోపీచంద్ సినిమాకు నిర్మాతలు మైత్రీ వాళ్లే కాబట్టి రు. 10 ఇస్తున్నారు. ఇది కూడా బాలయ్య అడగకుండా ఇస్తోంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమాకు కూడా రు. 10 – 12 కోట్ల రేషియోలోనే ఉంటుందని తెలుస్తోంది. ఒక సినిమా హిట్ అయ్యింది కదా ? అని తన తర్వాత సినిమాలకు నిర్మాతలు మోయలేని రేట్లు వసూలు చేస్తుంటే బాలయ్య మాత్రం ఎప్పటకీ నిర్మాతలకు అందుబాటులో ఉంటూ తాను నిర్మాతల హీరోగానే ఉన్నారు.
అందుకే బాలయ్య అంటే నిర్మాతలు చాలా హ్యాపీగా ఉంటారు. బాలయ్య చాలా రీజన్ బుల్ రెమ్యునరేషన్ మాత్రమే వసూలు చేస్తున్నారు. మిగిలిన హీరోలు కూడా రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు అందుబాటులో ఉంటే సినిమాల బడ్జెట్ తగ్గుతుంది. ఇటు బయ్యర్లకు కూడా లాభాలు వస్తాయి. హిట్ సినిమాలకు కూడా లాభాలు రాకపోవడానికి హీరోల రెమ్యునరేషన్ దురాశే అని చెప్పాలి. ఈ విషయంలో హీరోలు ఒక్క మెట్టు తగ్గి ఉంటే ఇండస్ట్రీ అంతా పచ్చగా ఉంటుంది.