ఎన్టీఆర్‌కు నూనుగు మీసాలు కూడా రాకుండానే అతడిని స్టార్ హీరోను చేసేసి.. ఎక్కడో టాలీవుడ్ శిఖరాగ్రపు అంచులమీద కూర్చోపెట్టిన సినిమాలు రెండు అందులో మొదటిది ఆది, రెండోది సింహాద్రి. 21 ఏళ్లకే సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ టాలీవుడ్ రికార్డులన్నింటికి పాతరేసేశాడు. అసలు సింహాద్రి మానియాలో యేడాది పాటు తెలుగు గడ్డ అంతా ఊగిపోయింది. ఎక్కడ చూసినా.. ఏ జిల్లాలో చూసినా కూడా సింహాద్రి థియేటర్ల దగ్గర తాండవం చేసేసింది. ఏకంగా 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడడం అంటే మామూలు విషయం కాదు.
అంత చిన్న వయస్సులో అంత పెద్ద బరువైన పాత్రను ఎన్టీఆర్ అలవోకగా చేసి ఔరా అనిపించాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ రౌద్ర రసం.. డ్యాన్సులు, ఫైట్లు చూసి జనాలకు పిచ్చెక్కిపోయింది. అయితే ఈ సినిమా కథ వెనక చాలా ప్లాష్‌బ్యాక్ ఉంది. ఈ సినిమాకు మూలం కమల్‌హాసన్ – శ్రీదేవి కలిసి నటించిన వసంత కోకిల. బాలుమహేంద్ర దర్శకత్వంలో 1992లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కారు యాక్సిడెంట్‌లో గతం మర్చిపోయిన శ్రీదేవిని కమల్ చేరదీస్తాడు. తక్కువ టైంలోనే వారిద్దరు సన్నిహితులు అవుతారు. అయితే ఆ తర్వాత శ్రీదేవికి గతం గుర్తుకు వచ్చి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుంది. దీంతో సోము పడే బాధ వర్ణనాతీతం.
ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్.. హీరోను వదిలి వెళ్లిపోయిన సన్నివేశం చూస్తూ గుండెల్లో గునపంతో పొడిచేసిఇనట్టు లేదూ.. అని విజయేంద్రప్రసాద్ ఓ మాట అన్నారట. వెంటనే ఆయన అసిస్టెంట్ అమ్మ గణేష్ హీరోను తాను అమితంగా ప్రేమిస్తున్న హీరోయిన్నే గుండెల్లో గునపంతో పొడిచినట్టుగా కథ రాసుకుందాం అనడంతో విజయేంద్రప్రసాద్ అక్కడ నుంచే కథ మొదలు పెట్టాడట.
కథలో కీలకమైన ప్లాష్‌బ్యాక్‌కు వేరే ఏదైనా ప్రదేశాన్ని నేపథ్యంగా తీసుకోవాలని డిసైడ్ అయ్యి కేరళను ఎంచుకున్నారు. ఫస్టాఫ్ కేరళ నేపథ్యంలో సినిమా నడుస్తుంది. అసలు ఇదే కథతో బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తీయాలని అనుకున్నారు. అయితే అప్పుడు బి. గోపాల్ – బాలయ్య కలిసి పలనాటి బ్రహ్మనాయుడు సినిమా కథను ఎంచుకున్నారు.
దీంతో ఇదే కథతో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తాను తీస్తానని సీనియర్ డిస్ట్రిబ్యూటర్ దొరస్వామిరాజు ముందుకు వచ్చారు. అలా వీఎంసీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్‌ను ఒక్కసారిగా తీసుకువెళ్లి శిఖరాగ్రంమీద కూర్చోపెట్టేసింది.