కొన్ని కొన్ని విషయాల్లో అన్నగారు ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. వాస్తవానికి ఆయన ఏదైనా చేయాలని అనుకుంటే.. ఎవరు కాదన్నా.. వద్దన్నా.. ముందుకే వెళ్లేవారు. సక్సెస్ సాధించారు కూడా. ఉదాహరణకు రాజకీయ రంగ ప్రవేశం అన్నగారి జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ విషయంలో సినీ రంగంలో అనేక మంది అన్నగారిని వద్దని చెప్పారు. మనకు సినిమాలుఎందుకు? అని అనేక మంది అడ్డు చెప్పారు. అయితే.. అన్నగారు మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు.
అయితే.. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఆయనపై ఎంత వత్తిడి వచ్చినా.. ఒకటికి రెండు సార్లు ఆలోచిం చి నిర్ణయం తీసుకునేవారు. అదే సమయంలో సలహాలు సూచనలను కూడా తూచ తప్పకుండా పాటించే వారు. ఎక్కువగా.. అక్కినేని నాగేశ్వరరావును సంప్రదించేవారు. రాజకీయాలపై ఆయన వద్దన్నా.. ముందుకు వెళ్లిన ఎన్టీఆర్.. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం అక్కినేని చెప్పింది చేసేవారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అన్నగారి పెద్ద కుమారుడు హరికృష్ణ.. తాను.. సినిమా హాలు కట్టుకుంటానని చెప్పారు.
చాలా రోజులు ఇంట్లో ఈ విషయం డిస్కషన్ కూడా జరిగింది. నేను సినిమాల్లో నిలదొక్కుకుంటాననే నమ్మకం లేదు. వ్యవసాయం చేయలేను.. ఒక వేళ చేసినా.. సినిమా హాలు కూడా కట్టుకుంటాను. పెట్టుబడి పెట్టండి.. అని అన్నగారిని సతాయించారు. అయితే.. ఈ విషయంపై అన్నగారు సుదీర్ఘంగా చర్చించారు. అక్కినేనిని కలిసి.. తన కుమారుడి అభిప్రాయం చెప్పారు. అయితే.. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో చాలా దూరం ఆలోచించే అక్కినేని దీనికి నో చెప్పారు.
సినిమా హాలు వద్దు.. స్టూడియో పెట్టుకుంటే.. నిత్యం వ్యాపారం జరుగుతుంది.. అని సలహా ఇచ్చారు. అయితే.. స్టూడియో పెట్టుకుని రన్ చేసేందుకు హరికృష్ణ ఇష్టపడలేదు. ఇలా రెండేళ్లపాటు.. అన్నగారికి.. హరికృష్ణకు మధ్య ఈ వివాదం జరిగింది. సినిమా హాలుకు మాత్రం.. అన్నగారు ససేమిరా అన్నారు. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన హరికృష్ణ.. హైదరాబాద్‌లో రామకృష్ణా సినీ స్టూడియో ఏర్పాటుకు దిగారు.
అయితే.. తర్వాత కాలంలో తాను సొంతంగా హాలు నిర్మించాలని హరికృష్ణ చేసిన ప్రయత్నాలు.. ముందుకు సాగలేదు. దీంతో ఆయన ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం రామకృష్ణ, తారకరామా ( రెండు థియేటర్లు) థియేటర్లతో పాటు ఏపీలో కూడా కొన్ని థియేటర్లను నిర్మించారు. ఇందులో తారకరామా థియేటర్లను ముక్తా వాళ్లు ఇప్పుడు లీజ్‌కు తీసుకుని రన్ చేస్తున్నారు.