నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో 107వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. థమన్ స్వరాలు అందిస్తుండగా మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమా ప్లాష్‌బ్యాక్ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం అని చెపుతున్నారు. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ బాలయ్యకు సోదరి పాత్రలో కనిపించబోతోంది.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. అక్కడే అల్లరి నరేష్ నటిస్తోన్న తాజా సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం షూటింగ్ కూడా నడుస్తోంది. దాదాపు ఒకే ప్లేస్‌లో రెండు సినిమాల షూటింగ్‌లు నడుస్తున్నాయి. అనుకోకుండా బాలయ్య, అల్లరి నరేష్ కలుసుకుని కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.
నరేష్ ప్రస్తుతం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం షూటింగ్లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా టీజర్ కూడా ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత నరేష్ ఈ సినిమాతో హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడన్న ఆశలు అయితే చాలా మందిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు ఈ సినిమా టీం.. బాలయ్య కలుసుకోవడం కాకతాళీయంగా జరిగింది.
ఈ సందర్భంగా బాలయ్య ఈ సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. బాలయ్య సడెన్‌గా అక్కడకు రావడంతో నరేష్‌తో పాటు ఆ సినిమా టీం సంతోషం వ్యక్తం చేసింది. అల్లరి నరేష్ మరియు టీమ్‌తో బాలకృష్ణ ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.