తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ.. ప్రత్యేక అధ్యాయాన్ని ఏర్పాటు చేసుకున్న అన్నగారు ఎన్టీ ఆర్.. క్రమశిక్షణకు మారు పేరు. యువ నటీనటులకు ఆయన ఇదే చెప్పేవారు. హీరో అయినా.. క్యారెక్టర్ నటులైనా.. సమయానికి రాకపోతే..షెడ్యూల్ అంతా కూడా పాడై పోతుందని.. అంతిమంగా అది నిర్మాత కు నష్టాలను తెస్తుందని.. ఆయన హితవు పలికేవారు. ఈ క్రమంలో చిరంజీవి, రజనీకాంత్ వంటివారు.. అన్నగారి బాటలో నడిచేవారు. క్రమశిక్షణ పాటించారు.
బహుశ అందుకేనేమో.. వారంతా చలన చిత్ర రంగంలో అగ్ర కథనాయకులుగా వెలుగు వెలుగుతున్నారు. అయితే.. అన్నగారికి పోటీ వచ్చిన కథనాయకురాలు.. ఉన్నారంటే.. ఆశ్చర్యం వేస్తుంది. ఆమే భానుమతి. అన్నగారు ఎంత కఠినమైన క్రమశిక్షణ పాటించేవారో.. `అంతకుమించి..` అన్న విధంగా భానుమతి డిసిప్లిన్ పాటించేవారు. ఎంతగా అంటే.. షూటింగ్ స్పాట్‌కు టైంకురావడమే కాదు.. మేకప్ కిట్‌ను వినియోగించే విషయంలోనూ.. చాలా జాగ్రత్తలు పాటించేవారు.
ఇప్పుడంటే..విదేశాల నుంచి మేకప్ కిట్‌లు ఎప్పుడు కావాలంటే..అప్పడు వస్తున్నాయి. అయితే.. అప్పట్లో అంటే.. ఓ 60 ఏళ్ల కిందట మేకప్ కిట్‌లుకావాలంటే.. వెయిట్‌చేసే పరిస్థితి వచ్చేది. అందుకే అప్పట్లో జూనియర్ ఆర్టిస్టులు చాలా మందికి కొద్ది పాటి మేకప్ వేసి..నటనలోకి దింపేసేవారు. ఈ కష్టాలు తెలిసిన.. భానుమతి.. మేకప్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునేవారట. ఒక్కసారి మేకప్ వేస్తే.. షెడ్యూల్ అయ్యేవరకు జాగ్రత్తగా చూసుకునేవారు.
అదేవిధంగా ఈటింగ్ ఔట్‌లకు భానుమతి కడు దూరం. ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్నే తినేవారు. ఇక, ఔట్‌డోర్ షూటింగులకు వెళ్లినప్పుడు.. సమీపంలోని ఆలయాల సత్రాల్లో బసచేసేవారట. పుణ్యానికి పుణ్యం.. ఖర్చుకు ఖర్చు కలిసి వస్తుందని.. అనేవారట. ఈ విధానం చూసిన అన్నగారు.. కొన్నాళ్లు ఇదే పద్ధతి పాటించారు. విశాఖలో అడవి రాముడు షూటింగుకు వెళ్లినప్పుడు.. సింహాచలం.. దేవస్థానం కాటేజీల్లో బసచేశారు. ఇలా.. అన్నగారిని మించిన క్రమశిక్షణతో ఆ హీరోయిన్ పేరు తెచ్చుకోవడం గమనార్హం.