దివంగత నటులు నందమూరి తారక రామారావు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ కూడా తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్లు లాంటి వారు. తెలుగు సినిమా రంగంలోకి ఎంతమంది హీరోలు వచ్చినా అసలు ముందు పునాది వేసింది.. రెండు కళ్లు లాంటి వారు మాత్రం ఈ ఇద్దరు హీరోలే. సినిమాల పరంగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోటీ ఎక్కువుగా ఉండేది. అయితే వీరి పోటీ వల్ల ఇండస్ట్రీకి మేలే ఎక్కువుగా జరిగేది.
వీరిద్దరు పోటీ పడి సినిమాలు చేయడంతో సినిమా పరిశ్రమలో ఎక్కువ మందికి ఉపాధి దొరికేది. ఒక్కోసారి వీరిద్దరు నటించిన సినిమాలే యేడాదికి 10 – 15 వరకు రిలీజ్ అయ్యేవి. ఆ టైంలో థియేటర్ల వాళ్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు పెద్ద పండగే పండగ. ఎవ్వరి దగ్గర చూసినా నాలుగు డబ్బులు కళకళలాడేవి. అయితే వీరి మధ్య సినిమాల పరంగా ఎంత పోటీ ఉన్నా కూడా కలిసి మెలిసే ఉండేవారు.
పైగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ అప్పటి తరం హీరోలకు ఆదర్శంగా ఉండేవారు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ మల్టీస్టారర్ సినిమాలు చేయడం మొదలయ్యాకే మిగిలిన స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అయితే వీరిద్దరి వారసులు బాలయ్య, నాగార్జున కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తే చూడాలని వీరి తరం అభిమానులు ఎన్నో ఆశలతో ఉన్నారు. అయితే ఇప్పటకీ ఆ కోరిక తీరలేదు.
విచిత్రం ఏంటంటే బాలయ్య ఏఎన్నార్‌తో కలిసి సినిమాల్లో నటించారు. కానీ నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేషన్ కుదర్లేదు. పోనీ బాలయ్య – నాగ్ కలిసి నటిస్తారన్న ఆశలు చాలా మందికి ఉంటే అది కూడా వీరు తీర్చలేకపోయారు. అయితే నాగార్జున – హరికృష్ణ కలిసి సీతారామరాజు సినిమా చేశారు. నాగ్, బాలయ్య ఇద్దరూ కూడా కలిసి నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
2011లో వీళ్లిద్దరి కాంబోలో సినిమా సెట్ చేసేందుకు నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్లాన్ చేశారు. మళయాళంలో హిట్ అయిన క్రిస్టియన్ బ్రదర్ రీమేక్ హక్కుల కోసం ఎంతో మంది పోటీపడ్డారు. అయితే బెల్లంకొండ ఆ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారు. నాగ్ – బాలయ్య కాంబినేషన్లో తొలి సినిమా తన బ్యానర్లోనే రావాలని బెల్లంకొండ ఈ కాంబినేషన్ సెట్ చేసేందుకు ఎంతో కష్టపడ్డారు.
చివరకు దర్శకుడిని సెట్ చేసే క్రమంలో బాలయ్య క్రిస్టియన్ బ్రదర్ వదిలేసి మరో కథ రెడీ చేసుకోమని చెప్పారు. ఆ కథ సెట్ కాలేదు. చివరకు అదే టైంలో బాలయ్య హీరోగా హరిహర మహాదేవ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నిర్మాత కూడా బెల్లంకొండే.. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఎంత లేదనుకున్నా బాలయ్య – నాగ్ మధ్య అనుకున్న స్థాయితో సత్సంబంధాలు లేకపోవడంతో వీరి మల్టీస్టారర్ కలగానే మిగిలిపోయింది.