టాలీవుడ్‌లో ఎంతమంది కమెడియన్లు ఉన్నా గత నాలుగు దశాబ్దాల్లో ఎప్పటకీ గుర్తుండిపోయే కమెడియన్‌గా .. అందులోనూ ఓ తెలుగు వ్యక్తిగా చెరగని ముద్ర వేసుకున్నాడు సుధాకర్. తెలుగు వాడు అయిన సుధాకర్ హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గా, కామెడీ విలన్‌గా.. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేసి తన పాత్రలతో సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందే సుధాకర్‌కు స్టార్ స్టేటస్ వచ్చింది.
ఇక చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సినిమాల్లో కూడా కమెడియన్‌గా సుధాకర్‌కు మంచి మార్కులు వచ్చాయి. అయితే సడెన్‌గా అనారోగ్యానికి గురి కావడంతో సుధాకర్ ఒక్కసారిగా సినిమాల నుంచి తప్పుకున్నాడు. అసలు కొన్నేళ్లు సుధాకర్ ఎక్కడ ఉన్నాడో కూడా ఎవ్వరికి తెలియలేదు. మద్యానికి పూర్తిగా బానిస అయిపోయిన సుధాకర్ ఎట్టకేలకు కోలుకుని ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు.
ఇటీవలే ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ పాత స్మృతులు నెమరవేసుకుంటున్నాడు. సుధాకర్ కుటుంబ స్వస్థలం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల. అయితే సుధాకర్ తండ్రి ఉద్యోగరీత్యా దేశంలో పలు ప్రాంతాలకు తిరుగుతూ ఉండడంతో సుధాకర్ విద్యాభ్యాసం కూడా పలు చోట్ల సాగింది. సుధాకర్‌కు తెలుగులో కంటే తమిళంలోనే ముందు మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండడంతో సుధాకర్ తమిళ్లో దూసుకు పోయాడు.
స్టార్ హీరోయిన్లతో పాటు స్టార్ దర్శకులతో కలసి పనిచేసి తక్కువ సమయంలో ఎక్కువ హిట్లు కొట్టాడు. 1980వ దశకంలో సుధాకర్‌కు రజనీకాంత్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటే నమ్మాల్సిందే. సుధాకర్ చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవికి మంచి స్నేహితుడు. యాక్టింగ్ స్కూల్ నుంచి బయటకు వచ్చాక సుధాకర్‌కు చిరంజీవి కంటే ముందే అవవకాశాలు రావడం.. అవి క్లిక్ అవ్వడంతో ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయాడు.
తమిళంలో సుధాకర్‌కు వరుస హిట్లు పడ్డాయి. అక్కడ 40 సినిమాలు చేస్తే అందులో 30 సూపర్ హిట్లు. రాధికతో సుధాకర్‌ది సూపర్ హిట్ ఫెయిర్. సుధాకర్ క్రేజ్‌తో అప్పటికే తమిళ ఇండస్ట్రీలో పాతుకుపోయిన సీనియర్ నటులు ఎంజీఆర్, జెమిని గణేషన్ సుధాకర్ ను చూసి ముక్కున వేలేసుకున్నారట. అప్పుడే చెన్నైలో సుధాకర్‌ను తొక్కేసే రాజకీయాలు స్టార్ట్ కావడంతో అక్కడ ఉండలేక హైదరాబాద్‌కు వచ్చేశాడు.
ఇక్కడ హీరోగా కొన్ని సినిమాలు చేసినా క్లిక్ కాలేదు. సెకండ్ హీరో పాత్రలు, కమెడియన్ పాత్రలు, హీరో ఫ్రెండ్ పాత్రలు, కమెడియన్ విలన్ పాత్రలు చేసుకుంటూ పాపులర్ అయిపోయాడు. 1990వ దశకంలో ఇక్కడ ఏ సినిమా వచ్చినా అందులో సుధాకర్ ఖచ్చితంగా కనిపించేవాడు. 600కు పైగా సినిమాల్లో నటించిన సుధాకర్ విపరీతంగా మద్యానికి బానిస కావడంతో ఆరోగ్యం దెబ్బతింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనే లేదు.