ఎన్టీఆర్ నట వారసుడు బాలయ్య – వసుంధర దంపతులది ఆదర్శవంతమైన జీవితం. బాలయ్య మాజీ ముఖ్యమంత్రి కొడుకు.. ఇటు మరో మాజీ ముఖ్యమంత్రికి వియ్యంకుడు.. భవిష్యత్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న లోకేష్‌కు స్వయానా మామ అయినా కూడా ఏనాడు ఆ దర్పం ప్రదర్శించడు. అలాగే కుటుంబాలను బాలయ్య రాజకీయాలు, సినిమాలకు ఎప్పుడూ లింక్ పెట్టడు. ఆయన సినిమా జీవితం వేరు.. రాజకీయ, వ్యక్తిగత జీవితం వేరు అన్నట్టుగా ఉంటారు.
బాలయ్య కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఆయన సినిమా, రాజకీయ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వరు. అసలు ఆ ఛాన్స్ బాలయ్యే ఇవ్వడు. ఇక బాలయ్య కాకినాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన వసుంధరను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత బాలయ్యతో వసుంధర పెళ్లి జరిగింది. అప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో బిజీగా ఉన్నాడు.
1982లో వీరి పెళ్లి జరిగింది. వసుంధర తండ్రి శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యారావు కుమార్తె. వసుంధర పెళ్లికి ముందు ఓ సరదా సంఘటన జరిగింది అట. వసుంధర వాళ్ల స్వస్థలం కాకినాడ. ఓ రోజు కాకినాడలో బాలయ్య నటించిన రామ్ రహీం షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్‌లో బాలయ్య రిక్షా తొక్కుతున్నాడట.
అయితే ఆ సీన్ చూసిన వసుంధర వాళ్ల అమ్మా… ఎన్టీఆర్ గారి కొడుకు అయ్యి ఉండి.. ఇలా రిక్షా తొక్కుతున్నాడేంటి.. ఎందుకు ఆయనకు అంత కష్టం అని ఫీల్ అయ్యిందట. ఆ తర్వాత వసుంధరతో బాలయ్యకు పెళ్లయ్యాక ఈ విషయాన్ని ఆమే స్వయంగా బాలయ్యతో చెప్పారట. అది విని బాలయ్య నవ్వుకున్నారట.
ఇక బాలయ్య సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ వ్యవహారాలు మొత్తం వసుంధరే స్వయంగా చూసుకుంటారు. నాలుగు దశాబ్దాలుగా బాలయ్య సినిమాల్లోనూ, గత పదేళ్లుగా రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. అయితే వసుంధర మాత్రం తన ముగ్గురు పిల్లల పెంపకంతో పాటు వారి ప్రయోజకులను చేయడంలో కీలక పాత్ర పోషించారు.