ReviewsTL రివ్యూ: విరాట‌ప‌ర్వం

TL రివ్యూ: విరాట‌ప‌ర్వం

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోన్న సినిమాల్లో విరాట‌ప‌ర్వం ఒక‌టి. రానా – సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా న‌క్స‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఖ‌మ్మం జిల్లాలో నిమ్న కులానికి చెందిన స‌ర‌ళ‌ అనే యువ‌తి న‌క్స‌లిజం ప‌ట్ల ఆస‌క్తితో ఏం చేసింది ? ఆమె జీవితం ఏమైంది ? అన్న రియ‌ల్ క‌థ‌ను బేస్ చేసుకుని తెర‌కెక్కించిన ఈ సినిమాకు వేణు ఉడుగుల ద‌ర్శ‌కుడు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలోన‌డుస్తుంది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల ( సాయిప‌ల్ల‌వి) పుట్టుకే న‌క్స‌లైట్ల నేప‌థ్యంలో ముడిప‌డి ఉంటుంది. పోలీసులు, న‌క్స‌లైట్ల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రుగుతున్న‌ప్పుడే ఆమె పుడుతుంది. ఆమె త‌ల్లికి పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మ‌హిళా న‌క్స‌లైటే ( నివేదా పేతురాజ్‌). ఆమె పెద్ద‌య్యాక మావోయిస్టు నాయ‌కుడు ర‌వ‌న్న ( ద‌గ్గుబాటి రానా ) రాసిన సాహిత్యం చ‌దివి అత‌డి ప్రేమ‌లో ప‌డిపోతుంది.

అయితే ఆమె త‌ల్లిదండ్రులు ఆమె బావ (రాహుల్‌ రామకృష్ణ)తో పెళ్లి నిర్ణ‌యిస్తారు. అయితే ఆమె ర‌వ‌న్న కోసం ఇంట్లో నుంచి పారిపోయి ఎన్నో క‌ష్టాలు ప‌డి త‌న ప్రియుడు ర‌వ‌న్న‌ను క‌లవ‌డంతో పాటు అత‌డికి త‌న ప్రేమ గురించి చెపుతుంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఎలాంటి ఇబ్బందులు ప‌డింది ? ర‌వ‌న్న‌పై ప్రేమ‌తో న‌క్స‌లైట్‌గా మారిన వెన్నెల చివ‌ర‌కు అదే న‌క్స‌లైట్ల చేతుల్లో ఎందుకు చ‌నిపోయింది ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

విశ్లేష‌ణ :
1992 ప్రాంతంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌కు తెర రూపం క‌ల్పించేందుకు ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల ఎంతో తాప‌త్ర‌య ప‌డ్డాడు. స‌ర‌ళ‌ను అప్ప‌ట్లో మావోయిస్టులు కాల్చి చంప‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. స‌ర‌ళ హ‌త్య‌లో త‌ప్పు పోలీసుల‌దా ? మావోయిస్టుల‌దా ? అన్న అంశాన్ని ద‌ర్శ‌కుడు ఎంతో సున్నితంగా, ఎమోష‌న‌ల్‌గా తెర‌కెక్కించాడు. సినిమా ఫ‌స్టాఫ్ అంతా వెన్నెల చుట్టూనే తిరుగుతుంది. ఆమె కుటుంబ నేప‌థ్యం, ర‌వ‌న్న‌పై ప్రేమ పెంచుకోవ‌డం.. అత‌డి కోసం ఇంటి నుంచి పారిపోయి చివ‌ర‌కు పోలీసుల చేతికి చిక్క‌డంతో ఫ‌స్టాఫ్ ముగుస్తుంది.

సినిమాలో చాలా సీన్లు మైండ్ బ్లోయింగ్‌గా, ఎమోష‌న‌ల్‌గా ఉంటూ హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉన్నాయి. ఆమె కుటుంబ నేప‌థ్యం సీన్లు, ర‌వ‌న్న విప్ల‌వ సాహిత్యానికి ముగ్దురాలై అత‌డితో ప్రేమ‌లో ప‌డ‌డం తన తండ్రిపై పోలీసులు దాడి చేసిన‌ప్పుడు వారితో వాగ్వివాదం చేయ‌డం.. ర‌వ‌న్న ద‌ళాన్ని పోలీసుల నుంచి త‌ప్పించ‌డం ఇవ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి.

సినిమాలో కొన్ని సీన్లు సాగ‌దీత‌గా ఉన్నా సాయిప‌ల్ల‌వి త‌న న‌ట‌న‌తో బోర్ కొట్ట‌కుండా కాపాడేసింది. సెకండాఫ్‌లో నుంచి మొద‌ల‌య్యే అస‌లు క‌థ‌లో పోలీస్ స్టేష‌న్లో ఉన్న వెన్నెల‌ను ర‌వ‌న్న ద‌ళం త‌ప్పించ‌డం.. ప్రొఫెస‌ర్ శ‌కుంత‌ల ( నందితాదాస్‌) అండ‌తో ఆమె ద‌ళంలో చేరి అక్క‌డ
భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర)లతో కలిసి చేసే పోరాటాలు ఆక‌ట్టుకుంటాయి.

ఇక ఈ త‌ర‌హా సినిమాలో మైన‌స్‌లు ఎత్తి చూప‌డం క‌రెక్ట్ కాదు. సినిమా కొన్ని చోట్ల స్లో అయిన భావ‌న‌తో పాటు న‌క్స‌లిజం నేప‌థ్యంలో సీన్లు రిపీటెడ్‌గా వ‌చ్చిన‌ట్టు ఉంటాయి. యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో సాయిప‌ల్ల‌వి న‌ట‌న కంట‌త‌డి పెట్టిస్తుంది. కామ్రేడ్ ర‌వ‌న్న పాత్ర‌లో రానా ఒదిగిపోయాడు. టెక్నిక‌ల్‌గా సురేష్ బొబ్బిలి మ్యాజిక్‌, శ్రీక‌ర‌ప్ర‌సాద్ ఎడిటింగ్‌.. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఇక ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌కే ఈ సినిమా క్రెడిట్ ఇవ్వాలి.

ఫైన‌ల్‌గా…
విరాట‌ప‌ర్వం విప్ల‌వ ప్రేమ‌క‌థ‌

విరాటప‌ర్వం రేటింగ్ : 3 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news