క్షణం, గుడాచారి,ఎవరు వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్. చేసింది తక్కువ సినిమాలే అయినా కొత్తదనం కోసం అతడు పడే తాపత్రయం అతడిని చాలా మంది ప్రేక్షకులను చేరువ అయ్యేలా చేసింది. తాజాగా అతడు నటించిన సినిమా మేజర్. 26/11 రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన తెరకెక్కిన సినిమా కావడం.. రిలీజ్‌కు ముందే ప్రీమియర్లు, అంచనాలు.. దీనికి తోడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడంతో మేజర్‌కు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ రోజు పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ :
సందీప్ ఉన్ని కృష్ణన్ (అడివి శేష్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి ప్రకాష్‌రాజ్ కొడుకును డాక్టర్‌ను చేయాలని.. తల్లి రేవతి ఇంజనీర్‌ను చేయాలని అనుకుంటుంటే సందీప్ మాత్రం ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలను అనుకుంటాడు. ఎన్నో కష్టాలు పడి చివరకు తాను అనుకున్న కోరిక నెరవేర్చుకుంటాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ఇషా ( సాయి మంజ్రేకర్‌ను) పెళ్లాడతాడు.
ఆర్మీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్ఎసీజీ కమెండో టీమ్‌కు ట్రైనర్‌గా ఎదుగుతాడు. ఇంట్లో చిన్న సమస్య రావడంతో సందీప్ ఇంటికి బయలుదేరుతున్న సమయంలోనే ముంబైలో తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు ఎటాక్ చేస్తారు. ఈ సమయంలో హోటల్లో ఉన్న ఉగ్రవాదులను సందీప్ ఎలా మట్టుబెట్టాడు ? ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు ? అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
ముంబై 26/11 దాడులపై గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ మేజర్ సినిమాను మాత్రం దర్శకుడు శశికిరణ్ నటీనటులు, నటన, కాస్ట్యూమ్స్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ఇలా ప్రతి అంశంలో అన్నింటిని పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసి మరీ ప్రజెంట్ చేశాడు. అసలు అడివి శేష్ మేజర్‌లో ఉన్ని కృష్ణన్‌గా కెరీర్ బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చాడు. చదువుతున్న కుర్రాడిగా, యుక్త వయస్కుడిగా, లవర్ బాయ్‌గా, దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుడిగా తన పాత్రలో అలా ఒదిగిపోయాడు.. జీవించేశాడు.
తండ్రి పాత్రలో ప్రకాష్‌రాజ్ చక్కగా సెట్ అయ్యాడు. క్లైమాక్స్‌లో ప్రకాష్‌రాజ్ పవర్ ఫుల్ స్పీచ్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. అడివి శేష్‌కి తల్లిగా రేవతి కూడా చక్కగా నటించారు. శేష్ ప్రియురాలిగా… భర్త ప్రేమకోసం వెయిట్ చేసే ఇల్లాలిగా సాయి మంజ్రేకర్ చక్కగా నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా వర్కవుట్ అయ్యింది.
గెస్ట్ రోల్ చేసిన శోభితా ధూళిపాళ్ల మెప్పించింది. ఆమె పాత్రను క్లైమాక్స్‌కి కనెక్ట్ చేసిన తీరు బాగుంది. సుపీరియర్ ఆఫీసర్‌గా మురళీశర్మ పాత్ర బాగుంది. అసలు పాత్ర, తీరుతెన్నులు, డైలాగులు ఇలా ఒకటేమిటి అన్ని ఆలోచింపజేసేలా.. హార్ట్‌ను టచ్ చేసేలా ఉంటాయి. తాజ్ హోటల్‌పై ఉగ్ర ఎటాక్‌తో ఇంటర్వెల్ కార్డ్ ఇచ్చారు.
ఇక సినిమాకు సెకండాఫ్ ఆయువుపట్టు. హోటల్లో ఉగ్రవాదుల అరాచకాలు, వారిని మట్టుపెట్టేందుకు సందీప్ ఉన్నికృష్ణనన్ వ్యూహాలు, ఇలాంటి టైంలో మీడియా అత్యుత్సాహం వల్ల జరిగే నష్టాలు ఇవన్నీ బాగా చూపించారు. ఇక చివరి 20 నిమిషాలు ప్రేక్షకుడు సీట్‌కు అతుక్కుపోయి చూస్తూ ఉంటాడు. ఓ వైపు ఒంటినిండా బుల్లెట్లు దిగి ప్రాణాలు పోతాయని తెలిసినా సందీప్ ఒక్కడే ఉగ్రవాదులు ఉన్న చోట్లకు వెళ్లి చివరి క్షణం వరకు దేశం కోసం పోరాటం చేయడం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.
ఆర్మీలో చేరుతా అని సందీప్ అంటే నీకేమైనా అయితే ఎలా ? అని తల్లి రేవతి అడిగినప్పుడు ప్రతి అమ్మ ఇలా అనుకుంటే అని సందీప్ చెప్పే డైలాగ్ మనస్సును తాకుతుంది. సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉన్నా వాటిని భూతద్దంలో పెట్టి వెతకలేం. టెక్నికల్‌గా అన్ని విభాగాలు బాగా కుదిరాయి. దర్శకుడు శశికిరణ్ తిక్క టేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఫైనల్‌గా…
దేశంకోసం ఓ సైనికుడి మొండి పట్టుదలే ఈ మేజర్
మేజర్ సినిమాకు తెలుగులైవ్స్ రేటింగ్ ఇవ్వట్లేదు.. జాతీయభావం, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన మేజర్.