ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ కెరీర్ ప్రారంభంలో మంచి హిట్స్ అందుకున్నా కూడా ఆ తర్వాత వస్తున్నాయి కదా అని ఎడాపెడా సినిమాలను ఒప్పుకొని అసలు సినిమా కెరీరే లేకుండా చేసుకుంటారు. అలాంటి వారు చాలా తక్కువ సమయంలోనే ఫేడవుట్ అవుతారు. దీనికి ముఖ్య కారణం
సీనియర్ హీరోల సినిమాలను ఒప్పుకోవడం.. ప్రాధాన్యత లేని పాత్రలు చేయడం. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమాతో టాలీవుడ్ సినిమాకు పరిచయం అయ్యింది రక్షిత.
కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ముందు ఇదే సినిమాను అప్పు పేరుతో పూరి తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీలో భారీ హిట్ సాధించింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా రక్షిత నటించింది. అదే హీరోయిన్‌ను పూరి తెలుగు తెరకు పరిచయం చేశారు. 2002లో వచ్చిన ఈ సినిమాతో రక్షిత కుర్రకారు గుండెలను మెలిపెట్టేసింది. ఇక్కడ కూడా మొదటి సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఇక పూరి వరుసగా తన సినిమాలలో అవకాశం ఇచ్చారు.
ఇడియట్ తర్వాత పెళ్లాం ఊరెళితే, శివమణి, నిజం సినిమాలు చేసింది. ఆ తర్వాత ఆంధ్రావాలా, చిరంజీవితో అందరివాడు సినిమాలు నటించే అవకాశం అందుకుంది. అయితే, రక్షిత.. శివమణి, అందరివాడు, నిజం సినిమాలు ఒప్పుకోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీటిలో ఆమె పోషించిన పాత్రలు ఎంత మాత్రం పాపులారిటీని తీసుకురాలేదు. పైగా మంచి హిట్స్ అందుకున్న సమయంలో ఇలా సీనియర్ హీరోల సరసన ప్రధాన్యత లేని పాత్రలను ఒప్పుకొని
కెరీర్ పాడు చేసుకుందన్న టాక్ అప్పట్లో వినిపించింది.
నిజం సినిమాలో ఆమె పాత్ర యూత్‌కు కనెక్ట్ అయ్యేది కాదు. ఇక అందరివాడు సినిమాలో చిరు పక్కన హీరోయిన్‌గా కాకుండా ఓ డమ్మీ పాత్రలో చేసింది. ఆ సమయంలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషలలో కూడా వరుసగా క్రేజీ చిత్రాలు చేశారు. మంచి క్రేజ్ ఉన్న సమయంలో కొన్ని సినిమాల ఎంపిక ఆమె కెరీర్ పూర్తిగా దెబ్బతినడానికి కారణం అయింది. యంగ్ హీరోలతో లవ్ స్టోరీస్ గనక చేసుంటే కొన్నేళ్ళపాటు రక్షిత ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేదే.
ఎందుకంటే ఇడియట్ తర్వాత ఆమె ఖచ్చితంగా స్టార్ హీరోయన్ అయ్యి టాలీవుడ్‌ను కొన్నాళ్లు ఊపేస్తుందనే అందరూ అనుకున్నారు. కానీ, ఒప్పుకున్న సినిమాలు చాలావరకు రాంగ్ ఛాయిసే అని దీనిని బట్టే అర్థమవుతోంది. ఆ తర్వాత ఆమె త్వరగానే ఫేడవుట్ అయి ప్రేమ మాస్టర్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.