మూడున్నర దశాబ్దాల క్రిందట సౌత్ సినిమా ఇండస్ట్రీని తన హాట్ ఇమేజ్, హాట్ ఐటెం సాంగులతో ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత. ఏలూరు పక్కనే ఉన్న కొవ్వలిలో పుట్టిన వడ్లపట్ల విజయలక్ష్మి ఇంట్లో చిన్న వయస్సులోనే ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మద్రాస్ మెయిల్ ఎక్కేసి చెన్నై చెక్కేసింది. అక్కడ కెరీర్ స్టార్టింగ్‌లో చిన్నా చితకా వేషాలు వేసుకుంటూ చివరకు సిల్క్ స్మితగా మారిపోయింది.
కెరీర్‌లో ఎంత ఎత్తుకు వెళ్లి.. ఉన్నత దశ చూసిందో కెరీర్ చివర్లో ఆమె అంత పతనదశకు చేరుకుంది. చివరకు నా అన్న వాళ్లకు కూడా ఆమె దూరమైపోయింది. నమ్మినోళ్లందరూ మోసం చేసేశారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె 1996 సెప్టెంబర్ 23న మద్రాస్‌లో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. చనిపోయే టైంకు స్మిత వయస్సు 36 ఏళ్లు.
అప్పటికే ఆమె దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ చూసేసింది. ఎంతో టాప్‌రేంజ్‌కు వెళ్లిన ఆమె చివర్లో పతనమైపోయింది. 450 సినిమాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇక స్మిత్ చనిపోయాక ఆమెను మోసం చేసిన వాళ్ల పేర్లు కొన్ని బయటకు వచ్చాయి. ఆమె చనిపోయేముందు రాసిన లెటర్‌లో కూడా నా చుట్టూ ఉన్న వాళ్లు నాకు మనశ్శాంతి లేకుండా చేశారంటూ ఆ లెటర్‌లో తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసింది.
అయితే బాబు మాత్రం ( చివర్లో ఆమె అనుపానులు చూసుకున్న వ్యక్తి) చాలా మంచివాడు అని.. నా కూడు ఎప్పుడూ తినేందుకు ఇష్టపడలేదు అని.. జీవితంలో అందరిలాగానే నాకు చాలా కోరికలు ఉన్నాయి.. బాబు తప్పితే అందరూ నా కష్టం తిని.. విశ్వాస ఘాతకులు అయ్యారని ఆమె బాధపడింది. ఇక ఆమె చనిపోయే ముందు రోజు రాత్రి కొంతమందికి ఫోన్ చేసి ఆందోళనతోనే మాట్లాడింది అట. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించనే లేదు. కన్నడ నటుడు రవిచంద్రన్, తెలుగు నటి అనూరాధ లాంటి వాళ్లు ఆమె చనిపోయాక ఆమె ముందు రోజు రాత్రే తమకు ఫోన్ చేసిందని తర్వాత చెప్పారు.
అయితే ఆమె మాటల్లో ఆందోళన ఉన్నా ఇంత ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేదు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్‌తో ఆమె ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు చివరి రోజు షూటింగ్‌లో తాను త్వరలో చనిపోతానని.. అప్పుడు నన్ను చూడడానికి వస్తావా ? అనడంతో అర్జున్ చీ అదేం మాట అని తేలికగా కొట్టి పడేశాడే తప్పా ఆమె నిజంగానే అన్నంత పని చేస్తుందన్నది ఊహించనే లేదు. సిల్క్ చనిపోయిన రోజు ముందు స్టార్స్ ఎవ్వరూ రాకపోయినా అతడే ఆమె పార్థీవదేహం దగ్గరకు వచ్చి ఆమె తనతో అన్న మాటలు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.