లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేశ్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని స్టార్ హోటల్ లో కుటుంబసభ్యులు, సన్నిహితుల నడుమ కన్నుల పండుగగా వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లై వారానికి నయన్ నుంచి వచ్చిన చిత్రం `ఓ2`.
జీఎస్ విగ్నేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైంది. రిత్విక్ జోతి రాజ్, భరత్ నీలకంఠన్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. సర్వైవల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న తెలుగు, తమిళ్ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా విడుదలైంది.
ఆక్సిజన్‌ను మనం చాలా తేలికగా తీసుకుంటాం. కానీ అదే గాలి ఒక్క క్షణం అందకపోయిందంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఈ పాయింట్ నేపథ్యంలోనే రూపుదిద్దుకున్న `ఓ2`లో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడే ఆరేళ్ల కుర్రాడికి తల్లిగా నయనతార నటించింది. అమ్మగా ఒక బాధ్యత కలిగిన మహిళగా సమాజం పట్ల గౌరవం ఉన్న పాత్రలో నయన్ చక్కగా నటించింది.
కానీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తీసుకున్న పాయింట్ మంచిగానే ఉన్నా.. దాన్ని దర్శకుడు డీల్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. టీజర్, ట్రైలర్‌లతో భారీ అంచనాలను పెంచినా.. నయన్ ఆ అంచనాల దరి దాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. పైగా ఈ మూవీ చేసినందుకుగానూ నయన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార ఇలాంటి సిల్లీ సబ్జెక్టును ఎందుకు ఎంచుకుంది, డబ్బు కోసమేనా అంటూ ఆమెపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక నుంచి అయినా కథల ఎంపికలో జాగ్రత్తలు వహిస్తే కెరీర్‌కు మంచిదని మరికొందరు నయన్‌కు హితవు పలుకుతున్నారు.