రికార్డులు సాధించాలన్నా దానిని తిరగరాయాలన్నా నందమూరి నటసింహం బాలయ్యకే సొంతం. ఈ డైలాగ్‌కు బాలయ్యకు అతికిపోయినట్టుగా సరిపోతుంది. తెలుగు గడ్డపై కొన్ని కేంద్రాల్లో బాలయ్య సినిమాలు అప్రతిహత విజయాలు సాధించాయి. బాలయ్యకు సీడెడ్‌లో ముందు నుంచి పట్టు ఉంది. అక్కడ బాలయ్యకు అభిమానులు భారీగా ఉంటారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. పైగా ఇప్పుడు బాలయ్య అదే సీమలోని హిందూపురం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇదే సీడెడ్ ప్రాంతంలోని ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు పట్టణాల్లో లెజెండ్ సంచలన రికార్డులు నమోదు చేసింది. ఎమ్మిగనూరు మినీశివలో 400 రోజులు ఆడితే.. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో షిఫ్టింగ్‌తో కలుపుకుని 1000కు పైగా రోజులు ఆడింది. ఎమ్మిగనూరు అంటేనే బాలయ్య సినిమాలకు అడ్డా. ఆయన నటించిన రౌడీఇన్‌స్పెక్టర్ – లారీడ్రైవర్ – బంగారు బుల్లోడు – నిప్పురవ్వ – బొబ్బిలి సింహం- వంశానికొక్కడు లాంటి సినిమాలు అప్పట్లో ఎక్కువ రోజులు ఆడాయి.
ఇదే ఎమ్మిగనూరులో బాలయ్య నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రెండూ ఒకే రోజు 1993, సెప్టెంబర్ 3న రిలీజ్ అయ్యాయి. నిప్పురవ్వ 50 రోజులు ఆడితే బంగారు బుల్లోడు సెంచరీ ఆడింది. 1997లో రిలీజ్ అయిన పెద్దన్నయ్య కూగా సెంచరీ కొట్టింది. ఇక 1999లో సోమేశ్వర టాకీస్‌లో రిలీజ్ అయిన సమరసింహారెడ్డి 177 రోజులతో సిల్వర్ జూబ్లీ ఆడేసింది. 2001లో శివ టాకీస్‌లో రిలీజ్ అయిన నరసింహానాయుడు 176 రోజులు ఆడి రెండో సిల్వర్ జూబ్లీ సినిమాగా పట్టణంలో రికార్డులకు ఎక్కింది.
2002లో మినీశివలో రిలీజ్ అయిన చెన్నకేశవరెడ్డి 105 రోజులు ఆడింది. 2004లో మినీ శివలో రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహా సినిమా కూడా 100 రోజులు ఆడగా.. 2010లో అదే థియేటర్లో వచ్చిన సింహా సినిమా 110 రోజులు ఆడింది. ఇవన్నీ ఈ పట్టణంలో బాలయ్య సెంచరీ సినిమాలు. ఇక భైరవద్వీపంతో పాటు శ్రీరామరాజ్యం ( 68 రోజులు) అర్థసెంచరీ కొట్టాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2014 మార్చి 28న మినీశివలో రిలీజ్ అయిన లెజెండ్ సినిమా సంచలన రికార్డ్ నమోదు చేసింది. ఏకంగా 400 రోజుల పాటు ఆడింది. ఇక బాలయ్య తాజా బ్లాక్‌బస్టర్ అఖండ సైతం ఇదే ఊళ్లో శ్రీనివాస థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇలా బాలయ్య సినిమాలు అంటే కొన్ని ఊళ్లలో మామూలు రికార్డులు నమోదు అవ్వవు. అలాంటి వాటిల్లో ఎమ్మిగనూరు ఒకటి. ఎమ్మిగనూరు అంటేనే ఎప్పటకీ బాలయ్య అడ్డాగా మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు.