నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో పౌరాణిక, సాంఘీక, చారిత్రక, జానపదం ఇలా ఎన్నో రకాలైన పాత్రల్లో నటించారు. వైవిధ్యానికి కొట్టిన పిండి బాలయ్య. బాలయ్య కెరీర్‌లో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య నటించిన సినిమా నిప్పురవ్వ. ఈ సినిమా కోసం విజయశాంతి నిర్మాతగా ఉంటానని చెప్పడంతో బాలయ్య డేట్లు ఇచ్చారు. తర్వాత బాలయ్య కూడా ఓ నిర్మాతగా యాడ్ అయ్యారు. యువరత్న ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించారు.
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో అప్పట్లో ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా 1993, సెప్టెంబరు 3 న విడుదలైంది. ఇదే రోజు బాలకృష్ణ నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు కూడా విడుదలయ్యింది. అయితే నిప్పురవ్వ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. ఈ సినిమా షూటింగ్‌లో పెద్ద ప్రమాదం జరిగింది. షూటింగ్ లేట్ అయ్యింది. కొందరు సినిమా రిలీజ్ వాయిదా వేయాలంటూ కోర్టుకు వెళ్లారు.
అలా ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆలస్యంగా నిప్పురవ్వ 1993, సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వచ్చింది. అయితే అదే డేట్‌కు బంగారు బుల్లోడు కూడా వేసుకున్నారు. నిప్పురవ్వలో విజయశాంతి – శోభన హీరోయిన్లుగా చేస్తే బంగారు బుల్లోడులో రవీనా టాండన్, రమ్యకృష్ణ హీరోయిన్లుగా చేశారు. ఈ రెండు సినిమాల్లో నిప్పురవ్వ కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వగా… బంగారు బుల్లోడు హిట్ అయ్యింది.
అయితే ప్లాప్ అయినా కూడా నిప్పురవ్వ కొన్ని అరుదైన రికార్డులు నమోదు చేసింది. ఒకే రోజు అదే బాలయ్య నటించిన మరో హిట్ సినిమా బంగారు బుల్లోడుతో పాటు రిలీజ్ అయ్యి కూడా.. ప్లాప్ టాక్‌తో కూడా రాజమండ్రిలో డైరెక్టుగా 4 ఆటలతో 100 రోజులు ఆడింది. రాజమండ్రిలో ఈ రెండు సినిమాలు కూడా డైరెక్టుగా శతదినోత్సవాలు జరుపుకోవడం ఓ రికార్డ్.
నిప్పురవ్వకు బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించారు. అయితే రండి కదలిరండి.. తరలిరండి అనే ఒక్క పాట మాత్రం రాజ్ కోటి స్వరపరిచారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మన్ ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించారు. ఇలా ఈ సినిమాకు నలుగురు సంగీత దర్శకులు కలిసి పనిచేయడం ఓ అరుదైన ఘటనగా నిలిచింది.
మ్యూజికల్ పరంగా నిప్పురవ్వ సూపర్ హిట్. ఆడియో రిలీజ్ అయిన తొలి రోజునే ఏకంగా లక్ష క్యాసెట్లు మార్కెట్లో అమ్ముడుపోవడం అప్పట్లో ఓ సెన్షేషన్. ఇదే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను తెలియజేస్తోంది. భారీ బడ్జెట్‌కు తోడు.. సినిమా షూటింగ్ లేట్ అవ్వడం.. సెకండాఫ్‌లో లోపాల కారణంగా ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాలో పాటలు ఇప్పటకీ సూపర్ హిట్టే.
కారణం ఏదైనా ఈ సినిమా తర్వాత బాలయ్య – విజయశాంతి మళ్లీ కలిసి నటించలేదు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ధర్నా చేసే సీన్ కోసం బాలయ్య ఏకంగా ఐదారు రోజులు ఆహారం తీసుకోలేదు. ఆ పాత్రలో సహజంగా నటించేందుకు బాలయ్య తన మేకింగ్‌ను మార్చుకోవడంతో ఆయన నిజంగానే నీరసపడిపోయాడు.