Moviesసీనియ‌ర్ హీరోయిన్లు సుమ‌ల‌త - మాలాశ్రీ ఇద్ద‌రు తెలుగు ఆడ‌ప‌డుచులే... వీళ్ల‌కు...

సీనియ‌ర్ హీరోయిన్లు సుమ‌ల‌త – మాలాశ్రీ ఇద్ద‌రు తెలుగు ఆడ‌ప‌డుచులే… వీళ్ల‌కు ఉన్న లింక్ ఇదే…!

తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు తెలుగు హీరోయిన్లు రావ‌డం క‌ష్ట‌మైపోతోంది. అంజ‌లి, ఈషా రెబ్బా లాంటి వాళ్లు వ‌చ్చ‌నా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు అయితే వెళ్ల‌డం లేదు. తాజాగా చాందిని చౌద‌రి కూడా ఎంట్రీ ఇచ్చింది. మ‌రి ఆమె అయినా క‌నీసం మీడియం రేంజ్ హీరోల సినిమాల వ‌ర‌కు వెళుతుందో ? లేదో ? చూడాలి. అయితే పాత‌త‌రంలో మాత్రం వాణీశ్రీ, సావిత్రి, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద, శ్రీదేవి ఇలా మంచి అచ్చ తెలుగు హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా చ‌క్రం తిప్పారు.

విచిత్రం ఏంటంటే అప్ప‌ట్లో అటు త‌మిళంకు, ఇటు హిందీకి కూడా మ‌న తెలుగు హీరోయిన్లే బెస్ట్ ఆప్ష‌న్‌గా ఉండేవారు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయిపోయింది. పాత త‌రం త‌ర్వాత సుమ‌ల‌త‌, రోషిణి, మాలాశ్రీ, ఆ త‌ర్వాత రంభ‌, రోజా లాంటి తెలుగు హీరోయిన్లు వ‌చ్చి ఓ వెలుగు వెలిగారు. ఇక సుమ‌ల‌త అచ్చ తెలుగు ఆడ‌ప‌డుచే. అయితే మాలాశ్రీ కూడా మ‌న తెలుగు అమ్మాయే అన్న విష‌యం ఎవ్వ‌రికి తెలియ‌దు. వీరిద్ద‌రికి ఓ కామ‌న్ లింక్ కూడా ఉంది.

గుంటూరు జిల్లా రేప‌ల్లెకు చెందిన సుమ‌ల‌త నాయుళ్ల కుటుంబంలో జ‌న్మించింది. చిన్న‌ప్పుడు నాట్యం నేర్చుకున్న క్ర‌మంలోనే సినిమాల‌పై ఆస‌క్తితో మ‌ద్రాస్‌కు చేరుకుంది. అక్క‌డ అనుకోకుండా వ‌రుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రావ‌డంతో ఇక్క‌డ ఓ వెలుగు వెలిగింది. త‌ర్వాత తమిళ‌, క‌న్న‌డ సినిమాలు కూడా చేసింది. క‌న్న‌డ సినిమాలు చేస్తోన్న టైంలోనే ఆమె అప్పుడు క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో రెబ‌ల్‌స్టార్‌గా ఉన్న అంబ‌రీష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముందుగా అంబ‌రీషే సుమ‌ల‌త‌కు ప్ర‌పోజ్ చేయ‌డం.. ముందు అంబ‌రీష్ రెబ‌లిజానికి కాస్త భ‌య‌ప‌డినా త‌ర్వాత సుమ‌ల‌త ఆయ‌న ప్రేమ‌ను ఓకే చేయ‌డం జ‌రిగాయి.

పెళ్లి త‌ర్వాత సుమ‌ల‌త అంబ‌రీష్‌తో క‌లిసి మండ్య‌లో స్థిర‌ప‌డిపోయారు. సినిమాల్లో రెబ‌ల్ స్టార్‌గా ఉన్న అంబ‌రీష్ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఇక భ‌ర్త మ‌ర‌ణాంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సుమ‌ల‌త 2019 ఎన్నిక‌ల్లో మండ్య నుంచి ఇండిపెండెంట్‌గా లోక్‌స‌భ‌కు పోటీ చేసి జేడీఎస్ నుంచి పోటీచేసిన యంగ్ హీరో నిఖిల్ కుమార్ గౌడ‌పై ఘ‌న‌విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం ఆమె లోక్‌స‌భ స‌భ్యురాలిగా ఉన్నారు.

ఇక మాలాశ్రీ కూడా తెలుగ‌మ్మాయే. ఆమె త‌ల్లి ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంకు చెందిన వారు. అయితే ఆమె క‌ల‌క‌త్తాకు చెందిన పంజాబీ అబ్బాయిని ప్రేమించారు. మాలాశ్రీ క‌డుపులో ఉండ‌గానే ఆమె భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేశారు. సో మాలాశ్రీ త‌న తండ్రిని ఎప్పుడూ చూడలేద‌ట‌. త‌న తండ్రి ఫొటో మ‌త్ర‌మే తాను చూశాన‌ని.. ఆమే స్వ‌యంగా ఓ సారి చెప్పారు. చెన్నైలో పుట్టి పెరిగిన మాలాశ్రీ 1990 ల్లో త‌న హాట్ ఇమేజ్‌తో తెలుగు కుర్ర‌కారును ఊపేశారు.

మాలాశ్రీ ప్రేమ‌ఖైదీ, బావ‌బావ‌మ‌రిది, సాహ‌స‌వీరుడు సాగ‌ర‌క‌న్య ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో త‌న అందాల‌తో మ‌త్తెక్కించేసేది. త‌ర్వాత క‌న్న‌డంలోకి వెళ్లి అక్క‌డ లేడీ ఓరియంటెడ్ సినిమాల‌తో లేడీ సూప‌ర్‌స్టార్ అయిపోయింది. క‌న్న‌డ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ రామును పెళ్లి చేసుకుంది. రాము క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో మృతిచెందారు. ప్ర‌స్తుతం ఆమె బెంగ‌ళూరులో ఉంటోంది. అలా సుమ‌ల‌త‌, మాలాశ్రీ ఇద్ద‌రూ తెలుగు ఆడ‌ప‌డుచులే కాకుండా.. ఇద్ద‌రూ క‌న్న‌డ సినిమా రంగానికి చెందిన వాళ్ల‌నే పెళ్లి చేసుకున్నారు.

Latest news