మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవి కాంబినేషన్ అంటే అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పటకీ ఓ స్పెషల్ సినిమా. అప్పటికే శ్రీదేవి టాలీవుడ్‌ను ఏలేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయి దేశాన్నే ఊపేస్తోంది. ఆ టైంలో మళ్లీ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సోషియో ఫాంటసీ సినిమా చేయాలని అనుకున్నప్పుడు అశ్వనీదత్ స్వయంగా ఆమెను ఒప్పించి తిరిగి తెలుగులో నటింపజేశారు.
భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఓ క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత మరోసారి అదే అశ్వనీదత్ నాగార్జున – శ్రీదేవి జంటగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో గోవిందా గోవిందా సినిమా నిర్మించారు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఇక శ్రీదేవి – చిరు జంటగా ఎస్పీ పరశురాం సినిమా కూడా తర్వాత వచ్చింది. అయితే అదే టైంలో శ్రీదేవి – చిరు కాంబినేషన్లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ సినిమా స్టార్ట్ అయ్యింది.
విచిత్రం ఏంటంటే ఈ సినిమాకు శ్రీదేవి స్వయంగా నిర్మాత. తన చెల్లి లత పేరుతో లతా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించాలని శ్రీదేవి నిర్ణయించుకుంది. అయితే పేరుకు మాత్రమే శ్రీదేవి చెల్లి శ్రీలత నిర్మాత అయినా వెనక ఉండి పెట్టుబడి పెట్టాలనుకున్నది మాత్రం శ్రీదేవియే. ఈ సినిమా కోసమే అప్పట్లో బాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న బప్పీలహరితో కొన్ని పాటలు కూడా రికార్డ్ చేయించారు. పాటలు బాగానే వచ్చాయి.
మౌనరాగం సినిమాలోని ప్లాష్‌బ్యాక్ ఆధారంగా వజ్రాలదొంగ సినిమా స్క్రిఫ్ట్ రెడీ అయ్యింది. చెన్నైలో శ్రీదేవి – చిరంజీవిపై ఓ పాట కూడా షూట్ చేశారు. అయితే ఈ సినిమా రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. బయ్యర్లు భారీ ఎత్తున అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే సినిమాపై ఉన్న భారీ హైప్ నేపథ్యంలో ఈ సినిమా కథ విషయంలో కోదండ రామిరెడ్డికి ఎక్కడో డౌట్ కొట్టేస్తోంది.
కోదండ రామిరెడ్డి ఇదే విషయాన్ని శ్రీదేవికి చెప్పడంతో ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా చేయడం కరెక్ట్ కాదని.. అందుకు ఈ కథ సెట్ కావడం లేదన్నారట. దీంతో శ్రీదేవి ఈ సినిమాను ఆపేశారు. శ్రీదేవి కథలో మార్పులు చేయమని చెప్పినా అది సాధ్యం కాలేదు. అయితే శ్రీదేవి మిస్టర్ ఇండియా సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని చిరంజీవికి చెప్పినా చిరంజీవి ఒప్పుకోలేదు. అలా శ్రీదేవి నిర్మాతగా మొదలు పెట్టిన తొలి సినిమా వజ్రాల దొంగ మధ్యలోనే ఆగిపోయింది.