సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లుగా ఎదుగుతారు. అయితే కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే హీరోలతో సమానమైన ఇమేజ్ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నిన్నటి తరం స్టార్ హీరోయిన్ విజయశాంతి కూడా ఖచ్చితంగా ఉంటారు. ఒకానొక టైంలో విజయశాంతి స్టార్ హీరోలను మించిన రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారు. ఆ టైంలోనే స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం విజయశాంతి క్రేజ్ చూసి షాక్ అయ్యారు.
ప్రతిఘటన, కర్తవ్యం లాంటి సినిమాలు విజయశాంతిని టాలీవుడ్‌లో శిఖరాగ్రాన కూర్చోపెట్టేశాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టడంతో ఆమెకు లేడీ అమితాబ్చన్ అన్న ట్యాగ్‌లైన్ స్థిరపడిపోయింది. ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూ.. ఇటు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము రేపేసింది.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల పక్కన చాలా సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టింది. ఇక ఒసేయ్ రాములమ్మ సినిమాలో విజయశాంతి విశ్వరూపం చూసిన తెలుగు ప్రేక్షకులు, సినిమా వాళ్లు భయపడిపోయారు. రాములమ్మలో ఈ రేంజ్ యాక్షన్ నటన ఉందా ? అని నోరెళ్లబెట్టారు. హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న టైంలోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని భుజానకెత్తుకున్నారు.
తెలంగాణ కోసమే తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. ఆ టైంలో ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ ఆమె వెండితెరపై కనిపించారు. ఇదిలా ఉంటే విజయశాంతి – చిరంజీవి కాంబినేషన్లో ఏకంగా 19 సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఈ కాంబినేషన్ అంటేనే హిట్ ఫెయిర్.
అయితే ఆ తర్వాత చిరు – విజయశాంతి 20 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదు. చిరు – తన మధ్య గ్యాప్ గురించి విజయశాంతి కూడా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను సినిమా పరిశ్రమ మద్దతు కోరితే ఎవ్వరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సహాయం చేయకపోయినా స్పందించి ఉంటే బాగుండేదని అనుకున్నానని… అప్పటి నుంచే చిరుతో 20 ఏళ్లు తాను మాట్లాడలేదని చెప్పారు.
అయితే సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ ఫంక్షన్లో మాత్రం చిరంజీవే స్వయంగా విజయశాంతి భుజంపై చేయి వేసి.. అన్ని సినిమాలు చేశాం.. అంత మంచి స్నేహితులం చిరంజీవిని నోరుతో ఎలా తిట్టాలనిపించిందని సరదాగా ప్రశ్నించారు. అప్పుడు విజయశాంతి అది రాజకీయ పరమైన వైరుధ్యమే తప్పా వ్యక్తిగత వైరుధ్యం కాదని చెప్పారు.