నటరత్న నందమూరి తారక రామారావు, సూపర్‌స్టార్ కృష్ణ సినిమా రంగంలో ఎంత స్టార్ హీరోలుగా ఉన్నా వీరి మధ్య పెద్ద ప్రచ్ఛన్నయుద్ధమే నడిచింది. ఇటు సినిమాల పరంగాను ఇద్దరూ పోటీ పడేవారు. ఎన్టీఆర్ పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘీకం ఏది చేసినా కూడా కృష్ణ అదే పాత్రలతో సినిమాలు చేయాలని అనుకునేవారు. మహాభారత కథతో తెరకెక్కిన దానవీరశూర కర్ణ, కురుక్షేత్రం సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. కావాలనే ఇద్దరూ పంతానికి వెళ్లి పోటీ పడి మరీ తమ సినిమాలు రిలీజ్ చేశారు.
అటు ఎన్టీఆర్‌కు అల్లూరి సీతారామ రాజు పాత్ర చేయాలన్న ఆలోచన వచ్చిందన్న విషయం తెలుసుకున్న వెంటనే కృష్ణ ఆ సినిమా చేసేశారు. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. కృష్ణ కూడా ఎన్టీఆర్ తెలుగుదేశంకు పోటీగా కాంగ్రెస్‌లోకి వెళ్లి పోటీ చేశారు. ఇలా అప్పట్లో ఎన్టీఆర్‌ను ఢీ అంటే ఢీ అనేలా ఢీకొట్టింది మాత్రం కృష్ణే. అప్పట్లో ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అలాగే నడిచేది.
ఈ క్రమంలోనే ఓ టైటిల్ కోసం ఎన్టీఆర్, కృష్ణ మధ్య పెద్ద ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. చివరకు ఇది పంతానికి పోవడంతో ఎవ్వరూ వెనక్కు తగ్గని స్టేజ్‌కు వెళ్లిపోయింది. అసలు విషయంలోకి వెళితే ఎన్టీఆర్ వారసుడు బాలయ్య, కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ ఇద్దరూ ఓ టైంలో సినిమాలు చేస్తుండగా.. ఇద్దరి సినిమాలకు సామ్రాట్ అనే టైటిలే పెట్టాలనుకున్నారు.
1987లో దేవికమల్ కంబైన్స్ పతాకంపై కేసి. శేఖర్ బాబు నిర్మాతగా బాలయ్య – విజయశాంతి జంటగా సాహస సామ్రాట్ సినిమా వచ్చింది. కె. రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ టైంలో పెద్ద వివాదం జరిగింది. ముందుగా ఈ సినిమాకు సామ్రాట్ అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఆ టైటిల్‌తో తన పెద్ద కుమారుడు రమేష్‌బాబును హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలని అనుకున్నారు.
ఈ క్రమంలోనే శేఖర్‌బాబును ఆ టైటిల్ వాడవద్దని చెప్పినా శేఖర్ బాబు ఒప్పుకోలేదు. చివరకు ఇటు వైపు ఎన్టీఆర్ రంగంలోకి దిగడంతో పెద్ద ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ఇద్దరూ పంతాలకు పోయారు. కొంతకాలం పాటు ఒకే టైటిల్ ( సామ్రాట్) తోనే రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. చివరకు పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకోవడంతో బాలయ్య హీరోగా శేఖర్ బాబు నిర్మించిన సినిమా టైటిల్ సాహస సామ్రాట్‌గా మార్చారు.
అటు కృష్ణ తనయుడు నటించిన సామ్రాట్ సినిమాను పద్మాలయ బ్యానర్‌పై కృష్ణ స్వయంగా నిర్మించారు. విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి సోనమ్ హీరోయిన్‌గా చేసింది. శారద కీలక పాత్ర పోషించారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యాయి.