మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి, కొడుకు కలిసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. తండ్రి, కొడుకులు కలిసి నటించడం అంటే అదో గొప్ప కాంబినేషన్. ఇక ఇటీవల టాలీవుడ్‌లో వస్తోన్న సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి వస్తోన్న అనువాద సినిమాలకు సైతం పాత సినిమాల పేర్లే పెడుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు పేర్లు పెట్టలేకపోతున్నారు. ఎక్కువ సినిమాలు వస్తుండడంతో పాత పేర్లనే రిపీట్ చేసుకుంటూ వస్తున్నారు.
ఈ ట్రెండ్ ఇలా ఉంటే ఒకే టైటిల్‌తో తండ్రి, కొడుకులు వేర్వేరు సినిమాలు చేస్తే.. ఆ రెండు కూడా సూపర్ హిట్ అయితే అంతకన్నా సెన్షేషనల్ ఏం ఉంటుంది.. అయితే అది టాలీవుడ్‌లో జరిగింది. ఈ అరుదైన ఘనత నటరత్న ఎన్టీఆర్, యువరత్న నందమూరి బాలకృష్ణకే దక్కింది. ఆ సినిమా పేరే రాముడు భీముడు. ఎన్టీఆర్ నటించిన రాముడు భీముడు సినిమా 1964లో రిలీజ్ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు తాపీచాణక్య దర్శకుడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ పోజ్‌లో నటించారు. ఎన్టీఆర్‌కు జోడీగా జమున, విజయలక్ష్మి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దీనిని హిందీలో కూడా రీమేక్ చేశారు. తర్వాత ఆయన తనయుడు బాలకృష్ణ 24 ఏళ్ల తర్వాత ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాలో నటించాడు. 1988లో ఈ సినిమా వచ్చింది. మురళీ మోహన్‌రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో నటించాడు.
తన తండ్రి ద్విపాత్రాభినయంతో చేసిన రాముడు భీముడు హిట్ అవ్వడంతో అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ బాలయ్య సినిమా డబుల్ యాక్షన్ చేసిన సినిమాకు కూడా అదే పేరు పెట్టారు. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి.. బాలయ్య రాముడు భీముడు కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సుహాసిని, రాధ నటించారు.
సత్యం సినీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు పరుచూరి సోదరులు సంభాషణలు సమకూర్చారు. అలా ఒకే టైటిల్‌తో తండ్రి, తనయులు ఇద్దరూ సినిమాలు చేయడం.. రెండు సినిమాల్లోనూ డబుల్ పోజ్ క్యారెక్టర్లు ఉండడం.. రెండూ సూపర్ హిట్ అవ్వడం జరిగాయి.