సినిమా రంగం అంటేనే అనేక రూమర్లకు.. గ్యాసిప్‌లకు పెట్టింది పేరు. హీరో.. హీరోయిన్లపై సినిమా రంగంలో ఉన్న రూమర్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికన్నా కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీ రోజుల్లోనే ఈగ్యాసిప్లు ఎక్కువగా ఉండేవి. ఇలా.. అన్నగారు ఎన్టీఆర్‌పైనా.. కొన్ని రూమర్లు తెరవెనుక ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి.. అదే.. అన్నగారి ఫస్ట్ పెళ్లాం!
ఇది వాస్తవానికి ఆయనను ఆటపట్టించేందుకు సీనియర్ దర్శక నిర్మాతలు పెట్టిన పేరు. అప్పట్లో ఎస్వీ రంగారావు, రాజనాల, రమణారెడ్డి, చిత్తూరు వి. నాగయ్య వంటివారితో అన్నగారు సినిమాలు ఎక్కువగా చేసేవారు. ఈ క్రమంలో వారికి ఉన్న కొన్ని అలవాట్లు ఎన్టీఆర్‌కు కూడా అబ్బాయి. నిజానికి పాల వ్యాపారం నుంచి సినీ రంగంలోకి ప్రవేశిం చే నాటికి అన్నగారికి పాలు, మజ్జిగ తప్ప.. మరో అలవాటు లేదట. కానీ, కొన్నాళ్లకు సీన్ డిమాండ్ పేరుతో సిగరెట్లను తాగడం నేర్చుకున్నారు.
కొన్ని సినిమాల్లో అన్నగారు స్టయిల్‌గా తాగే సిగరెట్ల పరంపరం యువతను బాగా ఆకర్షించింది. దీంతో యువత అన్నగారిని బాగా ఫాలో అయింది. ఇక, సీన్ కోసం .. చేసుకున్న అలవాటు కాస్తా.. రాజనాల, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు వంటి వారి కారణంగా..నిజమైన అలవాటుగా మారిపోయింది. దీంతో అన్నగారు.. సినిమా షూటింగుల సమయంలోనూ సిగరెట్ లేకుండ ఆఉండేవారు కాదట. కానీ, కొన్నాళ్లకు రమణారెడ్డి సిగరెట్ అలవాటును మానుకున్నారు.
అనారోగ్య కారణంగా ఆయనను డాక్టర్లు మానేయమన్నారు. తర్వాత.. రాజనాల సిగరెట్ మానేసి.. పైపు తాగడం ప్రారంభించారు. కానీ, అన్నగారు మాత్రం సిగరెట్లు వదిలి పెట్టకపోగా.. మోతాదు పెంచారు. ఇదే విషయంపై.. సినీ దర్శకులు.. నిర్మాతల దగ్గర.. ఆసక్తికర చర్చ సాగేది. “సిగరెట్ అంటే ఏమనుకుంటున్నావ్. రామారావ్ ఫస్ట్ పెళ్లాం. దానిని ఆయన వదిలి పెట్టడు. నువ్వు లేనిపోని సలహాలు ఇవ్వకు“ అని నిర్మాతలను దర్శకులు హెచ్చరించేవారట.
ఎందుకంటే.. అన్నగారి సిగరెట్ల ఖర్చు.. నిర్మాతలే చూసుకోవాల్సి వచ్చేది కాబట్టి. ఇదీ.. సంగతి. దీంతో అన్నగారి ఫస్ట్ పెళ్లాం అనే మాట చాన్నాళ్లు పాతతరం.. నటుల మధ్య సాగేదని.. గుమ్మడి రాసిన పుస్తకంలో పేర్కొనడం గమనార్హం.