నటరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఆయన కెరీర్‌లో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు తర్వాత మళ్లీ 2004 సంక్రాంతి కానుకగా వచ్చిన లక్ష్మీ నరసింహా సినిమాతో మాంచి ఊపు వచ్చింది. ఈ సినిమా 2004 ఎన్నికలకు ముందు రిలీజ్ అయ్యింది. పైగా అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ సినిమా అంజి, ఇటు ప్రభాస్ నటించిన వర్షం సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ మూడు టఫ్ సినిమాల పోటీలో లక్ష్మినరసింహా హిట్‌గా నిలిచింది.
కోలీవుడ్‌లో విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన సామి సినిమాను తెలుగులో లక్ష్మీనరసింహాగా రీమేక్ చేశారు. ఆశిన్ హీరోయిన్‌గా నటించింది. విజయవాడ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ప్రకాష్‌రాజ్ విలన్‌గా బాలయ్యతో ఢీ అంటే ఢీ అనే పాత్రలో కనిపించారు. కె. విశ్వనాథ్ బాలయ్యకు తండ్రిగా నటించారు.
సామి సినిమాకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ఆ రోజుల్లోనే రు. 12 కోట్ల బడ్జెట్ అవ్వగా 500 థియేటర్లలో రిలీజ్ చేశారు. 2004 జనవరి 14న లక్ష్మీనరసింహా రిలీజ్ కాగా.. అదే రోజు ప్రభాస్ వర్షం కూడా థియేటర్లలోకి వచ్చింది. ఆ మరుసటి రోజే చిరంజీవి అంజి రిలీజ్ అయ్యింది.
అయితే అప్పట్లో చిరు, బాలయ్య సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే అభిమానుల మధ్య గొడవలు జరిగేవి. ఒక్కోసారి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తాయి. బాలయ్య, చిరు ఇద్దరు హీరోల అభిమానులు కూడా తమ హీరో సినిమాయే హిట్ అవ్వాలంటూ భారీ ఎత్తున ర్యాలీలు చేయడంతో పాటు గ్రామాల నుంచి పట్టణాల వరకు భారీ హంగామా చేసేవారు. థియేటర్ల దగ్గర అయితే నానా రచ్చ ఉండేది.
1999 సంక్రాంతికి వచ్చిన సమరసింహారెడ్డి వర్సెస్ స్నేహంకోసం, 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన మృగరాజు వర్సెస్ నరసింహానాయుడు తర్వాత ఈ ఇద్దరు హీరోల సినిమాలు అంటే బాక్సాఫీస్ వార్ హీటెక్కేసేది. పైగా అది ఎన్నికల సంవత్సరం కావడంతో అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నాడు రాష్ట్రం అంతటా 144 సెక్షన్ పెట్టి ఎలాంటి అవాంచనీయ, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ప్రయత్నించింది.
చివరకు ఈ సంక్రాంతి పోరులో బాలయ్య సినిమాయే పై చేయి సాధించింది. అంజి ప్లాప్ కాగా.. ప్రభాస్ వర్షం కూడా బ్లాక్‌బస్టరే అయ్యింది. వర్షం బాగా ఆడడంతో ఆ ప్రభావం లక్ష్మీనరసింహా లాంగ్ రన్‌పై చూపించింది. తొలి వారంలోనే రు. 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన లక్ష్మీనరసింహా 277 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.