నటరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. బాలయ్య కెరీర్‌లో ఎక్కువుగా యాక్షన్ టైప్ సినిమాలే ఉండేవి. అవే సక్సెస్ అయ్యాయి. అయితే వీటన్నింటికి భిన్నమైన సినిమా నారీ నారీ నడుమ మురారి. కుటుంబ కథా చిత్రంగా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శోభనతో పాటు నిరోషా నటించారు. శారద అత్తగా, కైకాల సత్యనారాయణ మామగా, హీరోయిన్లు ఇద్దరూ మరదళ్లుగా నటించారు.
విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు కెవి. మహదేవన్ స్వరాలు అందించారు. 27 ఏప్రిల్, 1990 న రిలీజ్ అయ్యింది. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఓ 10 ఇంట్రస్టింగ్ విశేషాలను తెలుసుకుందాం.
1 – యువచిత్ర పతాకంపై నిర్మాత కాట్రగడ్డ మురారి బాలయ్య హీరోగా నిర్మించిన రెండో సినిమా నారీ నారీ నడుమ మురారి. తొలి సినిమా సీతారామ కళ్యాణం. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి.
2- నారీ నారీ నడుమ మురారి సినిమాలో వెంకటేశ్వర మహాత్యం సినిమా ఆధారంగా కొంత కథ కనిపిస్తుంది.
3- ఇక ఈ సినిమాలో హీరో పేరు కూడా వెంకటేశ్వరరావే కావడం విశేషం. సినిమాలో ఓ పాట, ఓ సీన్లో కూడా పాత సినిమా తాలూకూ క్లిప్పింగ్స్ కనిపిస్తాయి.
4- కెవి. మహదేవన్ సంగీతంలోని పాటలు అన్ని సూపర్ బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఏంగాలో తరుముతున్నదీ – వయసూ సొగసూ కలిసి వేళ – ఇరువురి భామల కౌగిలిలో పాటలు ఇప్పటకీ ఉన్నా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
5- సినిమాలో అంతా బాగున్నా కామెడీ కోసం సపరేట్‌గా ఉన్న చిట్టిబాబు, అనంత్, మమత ట్రాక్ సరిగా పండలేదన్న చర్చ అప్పట్లో నడిచింది.
6- ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని వేలచ్చేరి ప్రాంతంలో చిరంజీవి గెస్ట్‌హౌస్‌లో జరిగింది. తమిళనాడులో గోపీచెట్టిపాళ్యం వద్ద ఔట్ డోర్‌లో ఈ షూటింగ్ జరిగింది.
7- ఇక ఈ సినిమా కథానుసారం నక్కబొక్కలపాడు అనే ఊళ్లో జరుగుతుంది. దొంగరాముడు సినిమాలో అక్కినేని ఊరు పేరు కూడా ఇదే కావడం విశేషం.
8- బాలయ్య కెరీర్‌లో 50 వ సినిమాగా నారీ నారీ నడుమ మురారి సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వగా.. తర్వాత 100వ సినిమాగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి కూడా బ్లాక్‌బస్టర్ అయ్యింది.
9- ఈ సినిమా వచ్చిన వెంటనే వరుసగా ముద్దుల మేనళ్లుడు, లారీడ్రైవర్, తల్లిదండ్రులు, ఆదిత్య 369 సినిమాలతో బాలయ్య వరుస హిట్లు కొట్టారు.
10- ఇక సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకుండా హిట్ అవ్వడం.. ప్రీ క్లైమాక్స్‌కు ముందు చాలా సేపు హీరో కనపడకపోవడం కూడా విచిత్రమే..!