నటసింహం నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేస్తారు. బాలయ్య సినిమాలు అంటేనే తొడకొట్టడాలు, మీసం తిప్పడాలు.. పవర్ ఫుల్ పంచ్ డైలాగులు.. కళ్లు చెదిరే యాక్షన్ ఉండాలి. బాలయ్య అంటేనే పౌరాణికం, సాంఘీకం, చారిత్రకం ఇలా ఏ పాత్రల్లో అయినా జీవించేస్తాడు. నవరసాలను పలికించడంలో బాలయ్యకు ఇప్పుడున్న హీరోల్లో ఎవ్వరూ సాటిరారు.
బాలయ్యలో నటన మాత్రమే కాదు చాలా టాలెంట్స్ ఉన్నాయి. బాలయ్య ఓ సింగర్ కూడా.. బాలయ్యలో ఓ డైరెక్టర్ కూడా దాగి ఉన్నాడు. పైసా వసూల్ సినిమాలో బాలయ్య పాడిన పాట ఇప్పటకీ ఎంత హైలెట్ అయ్యిందో చూశాం. ఈ పాట విన్నవాళ్లంతా బాలయ్యలో ఈ రేంజ్ సింగర్ దాగి ఉన్నాడా ? అని అవాక్కయ్యారు. ఇక బాలయ్యలో మంచి కథకుడు దాగి ఉన్నాడు. ఆయన మంచి డైరెక్టర్ కూడా…!
బాలయ్యకు గతంలో రెండు పౌరాణిక సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కూడా వచ్చింది. అయితే ఆ ఛాన్స్ మధ్యలోనే చేజారిపోయింది. బాలయ్య తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా సామ్రాట్ అశోక. ఈ సినిమాకు బాలయ్య దర్శకుడు అన్న ప్రకటన వచ్చిన వెంటనే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. గౌతమ బుద్ధుడు సినిమాను తన దర్శకత్వంలో తీయాలన్న కోరిక బాలయ్యకు బలంగా ఉండేది.
ముందుగా బుద్ధం అశోక అనే టైటిల్నుకున్నారు. గౌతమ బుద్ధుడి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ సినిమా టైటిల్ సామ్రాట్ అశోక గా మారిపోయింది. రామకృష్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా… చాణక్యుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్‌పై బాలయ్య ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే విషయంలో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల బాలయ్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సామ్రాట్ అశోక సినిమాలో నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించారు. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు.
ఇక బాలయ్య రెండోసారి దర్శకత్వం వహిస్తున్నట్టు ప్రకటించిన సినిమా నర్తనశాల. ఈ సినిమాలో బాలయ్య అర్జనుడి పాత్రలో నటిస్తూ ఆయనే దర్శకుడిగా మారారు. ద్రౌపదిగా దివంగత సౌందర్య, ధుర్యోధనుడిగా సాయికుమార్‌ను మరికొన్ని పాత్రలకు టాలీవుడ్ ప్రముఖులను తీసుకున్నారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది.
రెండో షెడ్యూల్ స్టార్ట్ అయ్యే సమయంలో విజయేంద్ర వర్మ షూటింగ్‌లో బాలయ్య గాయపడ్డారు. ఆ తర్వాత షూటింగ్‌కు గ్యాప్ రావడం సౌందర్య 2004 ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో ఈ సినిమా పూర్తవ్వకుండా మధ్యలో ఆగిపోయింది. అయితే అప్పటికే షూట్ చేసిన 20 నిమిషాల సన్నివేశాలను గతేడాది ఓటీటీలో రిలీజ్ చేశారు.