దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా అదిగో పులి ఇదిగో తోక అన్న చందంగా పుంకాను పుంకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రెండు, మూడేళ్లుగా జాన్వీ విజయ్ దేవరకొండ పక్కన నటిస్తోందని.. కాదు ఎన్టీఆర్‌కు జోడీకడుతోంది.. మహేష్‌బాబు పక్కన, బన్నీ పక్కన చేస్తోందని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే ఇవేవి నిజం కాలేదు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ జనగనమణ సినిమాలో ఆమే హీరోయిన్ అని.. పూరి ఆమెతో మాట్లాడి ఓకే చేయించేశాడని కూడా అన్నారు. అది కూడా వాస్తవం కాలేదు.
అయితే అటు జాన్వీ కానీ.. ఇటు తండ్రి బోనీకపూర్ కాని ఆమె టాలీవుడ్ ఎంట్రీ వార్తలపై ఏనాడు స్పందించలేదు. ఇక తాజా వాతావరణం చూస్తుంటే జాన్వీకపూర్ ఇప్పట్లో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేలా లేదు. దీనికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రధానంగా డెసిషన్ తీసుకోవాల్సింది బోనీకపూర్. ఆమె తండ్రి సూచనలు, సలహాలతోనే ప్రతి సినిమాకు ఓకే చెపుతూ వస్తోంది.
జాన్వీని ముందుగా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ను చేయాలన్నదే బోనీ కోరిక. అక్కడ కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైంది. బాలీవుడ్లోనే ఆమెకు సరైన సక్సెస్ లేదు. జాన్వీ డెబ్యూ మూవీ ఢడక్ జస్ట్ ఓకే మూవీ. పైగా అది మరాఠా సినిమా సైరాత్‌కు రీమేక్. జాన్వీకి ఇప్పటి వరకు స్ట్రైట్ హిట్ లేనే లేదు. ది కార్గిల్ గర్ల్ – రూహి లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. బోనీకి మాత్రం ఎందుకో గాని బాలీవుడ్ లో క్లిక్ అయ్యాకే ఇతర సౌత్ భాషల్లోకి ఎంట్రీ చేయించాలని చూస్తున్నాడు.
ముందుగా సౌత్‌లోకి పంపితే అక్కడ తెలుగు, తమిళ భాషల్లో లాంచ్ చేస్తే తర్వాత బాలీవుడ్లో ఛాన్సులు రావని.. అక్కడ క్లిక్ కాదన్న సందేహాలు బోనీకి ఉన్నాయి. అందుకే సౌత్ నుంచి ఎన్ని క్రేజీ ఆఫర్లు వచ్చినా కూడా బోనీ మాత్రం అస్సలు ఓకే చెప్పడం లేదని తెలుస్తోంది. ముందుగా తన కుమార్తెను కేవలం బాలీవుడ్లో మాత్రమే స్టార్ హీరోయిన్ను చేయాలని గట్టి ప్లానింగ్‌తో ఉన్నాడు.