నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య తన కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. బాలయ్యకు సమరసింహారెడ్డి – నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలున్నా… వసూళ్ళ పరంగా రు. 200 కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా అఖండ రికార్డులకు ఎక్కింది.
అసలు ఈ రేంజ్ లో వసూళ్ళు వస్తాయని అఖండ మేకర్స్, బాలయ్య అభిమానులు సైతం ఊహించలేకపోయారు. ఇదిలా ఉంటే బాలయ్య కెరీర్ లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి సినిమా వచ్చింది.
బాలయ్య – కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. కోడిరామకృష్ణ తర్వాత బాలయ్యను మాస్, క్లాస్ ఫ్యామిలీ ప్రేక్షకులకు చేరువ చేసిన ఘనత కోదండరామిరెడ్డి దక్కుతుంది. బాలయ్య కెరీర్ లో 50 వ సినిమాగా తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి సినిమా అత్త అల్లుడు గొడవతో తెరకెక్కింది. ఇది పాత కథే అయినా ఆ సినిమాలో బాలయ్య అత్తతో పోరాడిన తీరు… మరదళ్లతో సరసాలు కోదండరామిరెడ్డి టేకింగ్.. పాటలు సంగీతం సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేశాయి.
అప్పటికే బాలయ్య టాలీవుడ్ లో తిరుగులేని మాస్ హీరోగా ముద్ర వేసుకున్నారు. అలాంటి మాస్ హీరోతో ఒక్క ఫైట్ కూడా లేకుండా పెద్ద హిట్ సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. రొటీన్ ఫార్మాట్ లోనే ఉన్న కథను బాలయ్య తన కెరీర్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 50వ సినిమాకు అంగీకరించడం గొప్ప విషయం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు శతదినోత్సవం జరుపుకుంది.
విచిత్రమేంటంటే ఈ సినిమాతో పాటే విడుదలైన బాలయ్య మరో సినిమా ముద్దుల మామయ్య 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడటానికి నానా పాట్లు పడింది. ముద్దుల మామయ్య సినిమాతో పాటే వచ్చిన నారీ నారీ నడుమ మురారి 40 కేంద్రాలకు పైగా 65 రోజుల పాటు ఆడుతూ థియేటర్లలో మంచి షేర్‌తో రన్ అవ్వుతూ 75 వ రోజుకు చేరుకుంది. మంచి షేర్ వస్తుండగానే 75వ రోజుకు వచ్చేసరికి 37 కేంద్రాల్లో ఈ సినిమాను తీసి వేయడం అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఈ సినిమాకు రన్నింగ్ లో జరిగిన అన్యాయం మరే సినిమాకు జరగలేదన్న టాక్ కూడా అప్పట్లో వినిపించింది. ఇండస్ట్రీలోని కొందరు కావాలని ఈ సినిమాను సరిగా ఆడకుండా థియేటర్ల నుంచి బలవంతంగా ఎత్తి వేయించారని ప్రచారం జరిగింది. ఏదేమైనా నారీ నారీ నడుమ మురారి పాత కథే అయినా బాలయ్య నటించిన తీరు…. అత్త తో పోట్లాడిన తీరునకు ప్రేక్షకులు ఇప్పటికీ సినిమా చూస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.