సుమలత అచ్చ తెలుగు ఆంధ్రా పడుచు. కర్నాకట రెబల్ స్టార్ అంబరీష్‌ను పెళ్లి చేసుకున్న సుమలత కర్నాటకలోని మాండ్యలో స్థిరపడిపోయింది. సుమలత స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె. చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉన్న ఆమె ఎలాంటి అంచనాలు లేకుండా హీరోయిన్ అయ్యింది. ముందుగా ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి పక్కన ఖైదీ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో పాటు ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సుమలత తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది.
సుమలత చూడడానికి అచ్చ తెలుగు ఆడపడుచులా ఉంటుంది. ఆమె ఎక్కువుగా సంప్రదాయ బద్ధమైన పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పించేది. కన్నడలో సినిమాలు చేసే టైంలోనే ఆమె అంబరీష్‌తో ప్రేమలో పడింది. అంబరీష్‌తో ఆమె ప్రేమలో పడింది అనే కంటే అంబరీషే ముందుగా సుమలత ప్రేమలో పడ్డాడు. అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో రాజ్‌కుమార్, విష్ణువర్థన్‌కు పోటీగా అంబరీష్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అంబరీష్ అంటే మాస్లో పిచ్చ క్రేజ్ ఉండేది.
అలాంటి టాప్ స్టార్ తనకు ప్రపోజ్ చేయడంతో పాటు ఏకంగా పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సుమలతకు ముందుగా ఏం చేయాలో పాలుపోలేదట. చివరకు ఎలాగైతేనేం అంబరీష్ ప్రేమకు ఆమె పడిపోయింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది. చాలా మంది మాత్రం అంబరీష్ ఇప్పటికే చాలా మందికి అలాంటి మాయ మాటలు చెప్పాడు. నువ్వు ఆ మాయలో పడొద్దు అని సుమలతకు చెప్పారు. అయినా అంబరీష్‌ను ఆమె నమ్మింది.
అయితే సుమలత, మరో సీనియర్ హీరోయిన్ సుహాసిని బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరు ఇప్పటకీ కలుస్తూ ఉంటారు. 1980 హీరోలు, హీరోయిన్ల ఫంక్షన్లలో సుమలత, సుహాసిని ఎప్పుడూ రచ్చ చేస్తూనే ఉంటారు. సుమలత తాను అంబరీష్‌ను పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పినప్పుడు సుహాసిని సుమలతను పిచ్చగా తిట్టేసిందట. అబ్బో అంబరీష్ నీకు సెట్ కాడు.. నువ్వు దయచేసి అతడిని పెళ్లి చేసుకోవద్దని చాలా ఒత్తిడి చేసీ మరి చెప్పిందట.
చివరకు సుమలత వినకపోవడంతో నీ ఖర్మ అని కూడా తిట్టేసిందట. పెళ్లయ్యాక చాలా ఏళ్లకు సుమలత ఈ విషయాన్ని అంబరీష్ చెవిలో వేయడంతో ఓ సారి సుహాసిని కలిసినప్పుడు ఏమ్మా నేను నీకు ఏం అన్యాయం చేశానని.. సుమలతను నాకు కాకుండా చేయాలని అనుకున్నావు ? అని ప్రశ్నించడంతో సుహాసిని సిగ్గుపడిపోయిందట.
అయితే వాస్తవంగా సుహాసిని ఉద్దేశం ఇక్కడ వేరు అని సుమలత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సాఫ్ట్ నేచర్ ఉన్న తనకు, కాస్త రెబల్‌గా ఉండే అంబరీష్‌కు ఎక్కడ సెట్ కాదో… ఎక్కడ తాను ఇబ్బంది పడతానో అన్న ఉద్దేశంతో మాత్రమే ఆమె అలా చెప్పిందని.. అంతకు మించి వేరే ఉద్దేశం లేదని చెప్పింది. ఇక తాను చెన్నై వెళ్లినా వాళ్ల ఇంటికి వెళతానని.. సుహాసిని బెంగళూరు వచ్చినా తమ ఇంటికి వస్తుందని చెప్పింది.