దివంగత తార సిల్క్ స్మిత అంటే 1970 – 80 వ దశకంలో కేవలం తెలుగు వాళ్లకు మాత్రమే కాదు.. సౌత్ సినీ ప్రేక్షకులకు ఓ తెలియని మైకం. ఆమె ఓ సినిమాలో చిన్న ఐటెం సాంగ్ చేసినా కూడా ఆ సినిమా రేంజ్, వసూళ్ల రేంజ్ వేరేగా ఉండేది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ( ఇప్పుడు ఏలూరు జిల్లా) కేంద్రమైన ఏలూరుకు సమీపంలోని కొవ్వలిలో నాలుగో తరగతి వరకే చదువుకుంది. చదువు పక్కన పెట్టేసి.. ఇష్టం లేని పెళ్లికి బైబై చెప్పేసి మద్రాస్ వచ్చేసింది.
మద్రాస్ రైలెక్కిన వడ్లపట్ల విజయలక్ష్మి కాస్తా ఇండస్ట్రీకి వచ్చిన సిల్క్ స్మిత అయిపోయింది. తాను సినిమా జీవితం కోరుకుంది.. సినిమాల్లో వెలిగిపోవాలని అనుకుందే తప్పా తన జీవితమే సినిమా జీవితం అవుతుందన్నది ఆమె ఊహించలేకపోయింది. టచప్ ఆర్టిస్టుగా చేరి చిన్నా చితకా పాత్రలకే పరిమితం అవుతోన్న టైంలో మళయాళ దర్శకుడు ఆంథోనీ ఈస్ట్‌మన్ ఆమెను ఇనయే తేడీ సినిమాలో హీరోయిన్‌గా చేసి స్మిత అని పేరు పెట్టాడు. తర్వాత వండిచక్రం తమిళ సినిమాతో స్మిత కాస్తా సిల్క్ స్మిత అయిపోయింది.
ఆమెలో ఏదో తెలియని సిల్క్ లాంటి ఆకర్షణ ఉండడంతో ఆమె పేరును సిల్క్ స్మిత చేసేశారు. చివరకు ఆ పేరుతోనే ఆమె జగమంతా పాపులర్ అయిపోయింది. ఇప్పటకీ ఆ పేరు చెపితే ఈ తరం జనరేషన్ కూడా ఠక్కున గుర్తు పట్టేస్తారు. సౌత్ తెరపై జయమాలిని, జ్యోతిలక్ష్మి హవా కొనసాగుతోన్న రోజుల్లో ఆమె సడెన్‌గా దూసుకువచ్చి వెండితెర శృంగార రారాణి అయ్యింది. తమిళ ప్రేక్షకులు అయితే ఆమెను సిల్క్ అని పిలుస్తారు.
ఇక సిల్క్ స్మిత అంటే అప్పట్లో పడిచచ్చేవాళ్లు. తనను తాను ఎలాగైనా ప్రదర్శించుకునే కళాత్మక సిల్క్ సొంతం. అందుకే నిర్మాతలు, దర్శకులు ఆమెకు సూచనలు ఇచ్చేవారు కాదు. పైగా వాళ్ల అంచనాలను మించిపోయి ఆమె నటన ఉండేది. స్కర్ట్స్, షాట్ డ్రెస్సులతో షూటింగ్‌లో కూర్చునేందుకు ఇబ్బంది పడుతోన్న టైంలో ఆమె కాలుమీద కాలువేసుకుని కూర్చొంటే ఆమెకు గర్వం అని అపార్థం చేసుకుని ఆమె మీద నెగిటివ్ ప్రచారం చేసినవాళ్లు కూడా ఉన్నారు.
ఇక ఆమె అంటే అప్పట్లో ఎంతలా పడిచచ్చేవాళ్లు అంటే మద్రాస్‌లో ఆమె కనిపిస్తే చాలు ఓ కిల్లీ తెచ్చుకుని ఆమెను కొరికి ఇవ్వమని బతిమిలాడుకునే వాళ్లు. ఆమె కొరికిన కిళ్లీని వాళ్లు మహా ప్రసాదంలా కళ్లకు అద్దుకుని తినేవారు. తమిళ ఫ్యాన్స్ సిల్క్ విషయంలో ఇంత వెర్రీ అభిమానంతో వ్యవహరించే వారు. మరో ఆసక్తికర సంఘటన ఏంటంటే 1984లో ఓ సారి షూట్ బ్రేక్ లో ఆమె యాపిల్ తింటోంది. వెంటనే డైరెక్టర్ యాక్షన్ అని చెప్పడంతో ఆమె సగం తిన్న యాపిల్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.
ఆ సగం తిన్న యాపిల్‌ను ఆమె మేకప్‌మేన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్స్‌లో ఉన్న వాళ్లు ఆ యాపిల్‌ను దక్కించుకునేందుకు పెద్ద యుద్ధమే చేశారు. చివరకు అక్కడ ఉన్న వాళ్లు దానిని రు. 26 వేలకు కొనుక్కున్నాడు. అసలు ఆ రోజుల్లో అంత అమౌంట్‌తో సగం తిన్న యాపిల్‌ను కొనుక్కోవడం అంటే మాటలా ? అది సిల్క్ రేంజ్ మరీ…!