తెలుగు వెండితెరమీద ఆమె ఓ రతీదేవి… దక్షిణాది వెండితెరను ధ్వంసం చేసిన శృంగార తార. ఆమె చూపులే ప్రేక్షకులను మత్తెక్కించేసేవి… ఆమె మాటల్లో తెలియని కైపు కనిపించేది. చిన్న వయస్సులోనే స్టార్ హీరోలు, హీరోయిన్లు కుళ్లుకునేంత క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె 36 ఏళ్లకే అర్దాంతరంగా చనువు చాలించింది. ఆమె మరణవార్త తెలిసి దక్షిణాది సినీ ప్రపంచం నివ్వెరపోయింది. ఆమె ఎవరో కాదు సిల్క్‌స్మిత.. అలియాస్ వడ్లపట్ల విజయలక్ష్మి.
1996 సెప్టెంబర్ 23 ఉదయం 7 గంటలకే ఆమె మరణవార్త దానవాలంలా వ్యాపించింది. చెన్నైలోని వలసరవాక్కంలో తన ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకటిన్నర దశాబ్దంపాటు కోట్లాది మందిని ఉర్రూతలూగించేసిన స్మిత ఒకటి కాదు రెండు కాదు 450 సినిమాల్లో నటించింది. ఆమెకు 1975 – 1990 మధ్య కాలంలో ఎంత క్రేజ్ ఉండేదంటే.. ఇంకా చెప్పాలంటే చచ్చిపోయే వరకు కూడా… తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన జస్టిస్ చౌదరి సూపర్ హిట్.
ఆ సినిమాను తమిళంలో 1983లో నీతిపతిగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ స్థానంలో శివాజీ గణేషన్.. ఆయన కుమారుడు ప్రభు చేశారు. హీరోయిన్ రాధిక. ఇది బిగ్ కాంబినేషన్ కావడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా ప్రివ్యూ చూసిన బయ్యర్లు పెదవి విరిచారు. సినిమా అమ్ముడుపోదని.. అంతేకాదు ఆడదని కూడా చెప్పడంతో శివాజీ బిత్తరపోయారు. పెద్దాయనతో సినిమా తీస్తే ఇదేం పద్ధతి అని ఆయన నిలదీశారు.
అయితే జనం పల్స్ తెలిసిన బయ్యర్లు మాత్రం సినిమాకు ఇంకేదో కావాలని పట్టుబట్టారు. చివరకు నిర్మాత సురేష్ బాలాజీకి సినిమా అమ్ముడుపోతే తప్పా వేరే గత్యంతరం లేదు. చివరకు సిల్క్ స్మిత డేట్ల కోసం ట్రై చేశారు. 15 రోజుల తర్వాత అతికష్టం మీద ఆమె డేట్లు దొరికాయి. ఆది కూడా రాత్రి పూట మాత్రమే. ఈ లోగా బాలసుబ్రహ్మణ్యం, జానకీతో రెడీగా పాట షూట్ చేయించి పెట్టారు. చెన్నై బీచ్‌లో వేసిన సెట్‌లో పాట షూట్ చేశారు.
మత్తెడుక్కుమ్ ఆశయిలే కట్టుమారం యారయిలే.. తొట్టుతళువుడది కాత్తు.. ముంగి ముంగి యేందిరిచ్చేన్ అంటూ సాగే పాట నిజంగానే బయ్యర్లకు మత్తెక్కించేసింది. సినిమాను భారీ రేట్లకు కొన్నారు. సినిమా అంచనాలకు మించి బ్లాక్‌బస్టర్ అయ్యింది. అది సిల్క్ రేంజ్ అప్పట్లో అలా ఉండేది. సిల్క్ చనిపోయిన రోజు సాయంత్రానికి ఆమె పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆమె చనిపోతే తమిళ, తెలుగు సినిమా పరిశ్రమల నుంచి స్పందన పూర్. సాయంత్రానికి హీరో అర్జున్ మాత్రమే అందరికంటే ముందు వచ్చాడట.
అర్జున్ రావడానికి కూడా ఓ విచిత్రమైన కారణం ఉంది. అంతకు కొద్ది రోజుల ముందే స్మిత అర్జున్‌తో ఓ సినిమా షూటింగ్ చివరి రోజు నేను త్వరలోనే చనిపోతున్నాను.. నన్ను చూడడానికి వస్తావా ? అని చెప్పిందట. ఛీ అదేం మాట అని తేలిగ్గా కొట్టిపడేశాడే కాని.. ఇంత ప్రమాదం జరుగుతుందని అతడూ ఊహించలేకపోయాడు. అక్కడకు వచ్చి స్మిత పార్థీవదేహాన్ని చూసి భోరున విలపించాడు. ఎంత బాధాకరం అంటే స్మిత చనిపోయాక ఆమెతో అవసరం లేదు అనుకుందేమో గాని చిత్ర పరిశ్రమ ఒక్క సంతాప సభ కూడా జరపలేదు.