ఏ సినిమా కథ అయినా మన నిజ జీవితం నుంచో లేదా ఏదో ఒక ప్రేరణ నుంచో పుడుతుంది. మనం చూసే చాలా సినిమాలు మనలో ఎవరో ఒకరి జీవితంలో జరిగేవే అయ్యి ఉన్నట్టుగా ఉంటాయి. ఇక నిజ జీవిత కథలతో చేసే సినిమాలకు, నేచురాలిటీ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో క్లాసిక్ సినిమాగా నిలిచింది మురారి.
యువరాజు, వంశీ లాంటి రెండు డిజాస్టర్ సినిమాల తర్వాత మహేష్ – కృష్ణవంశీ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఎక్కడా లేని అంచనాలు ఏర్పడ్డాయి. 2001 ఫిబ్రవరిలో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలు అందుకుంది. సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు అందించారు. ఆల్బమ్ బ్లాక్‌బస్టర్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమా సింగిల్ థియేటర్లో కోటి రూపాయలు వసూలు చేసింది.
అప్పట్లో థియేటర్లలో నరసింహానాయుడు, దేవీపుత్రుడు లాంటి సినిమాలు ఉన్నా కూడా మురారి మంచి వసూళ్లు రాబట్టింది. అయితే మురారి సినిమా కథకు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు లింక్ ఉందన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ సినిమా నిర్మాత నందిగం రామలింగేశ్వరరావుకు కృష్ణకు మంచి అనుబంధం ఉంది. మహేష్ కోసం ఏ కథ సెట్ చేయాలా ? అని ఆలోచించి ఆ బాధ్యత దర్శకుడు కృష్ణవంశీకే అప్పగించారు.
కృష్ణవంశీ ఓ రోజు గోదావరి బోటులో ప్రయాణిస్తున్నాడట. పక్కనే ఆయుర్వేద డాక్టర్ గున్నేశ్వరరావు కూడా ఉన్నాడట. మాటల మధ్యలో కృష్ణవంశీ రాజీవ్ గాంధీ, ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ ఇలా ఒకే కుటుంబంలో అందరూ ఎందుకు చిన్న వయస్సులో మృతి చెందారంటూ ప్రశ్నించారు. వెంటనే ఆ డాక్టర్ అది వాళ్ల కుటుంబానికి పట్టిన శాపం అని చెప్పారు. అనంతరం డాక్టర్ తమ గ్రామంలో జరిగిన ఓ నిజ సంఘటనను కూడా చెప్పారు.
ఆ రెండు కథలు విన్న కృష్ణవంశీకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదట. వెంటనే మహేష్‌బాబు కోసం అప్పటికే బృందావనంలో కృష్ణుడు అనే కాన్సెఫ్ట్ రెడీ చేసుకున్నాడట. ఆ కథకు శాపం కాన్సెఫ్ట్ యాడ్ చేసి నిర్మాతకు చెప్పడంతో ఆయన ఇంప్రెస్ అయిపోయారట. చివరకు ఆ కథనే కృష్ణ, మహేష్‌బాబు ఓకే చేయడంతో మురారి సినిమా పుట్టింది.