యూత్‌లో మాంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు విశ్వక్‌సేన్ నటించిన లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం. రిలీజ్‌కుముందే కాంట్రవర్సీతో మాంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందా ? లేదా ? అన్నది సమీక్షలో చూద్దాం.
కథ:
33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాని అల్లం అర్జున్ కుమార్ (విశ్వక్సేన్) తెలంగాణలోని సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. చివరకు చాలా ప్రయత్నాల తర్వాత గోదారి ప్రాంతానికి చెందిన మాధవి (రుక్సర్ థిల్లాన్)తో పెళ్లి కుదురుతుంది. ఓ బస్సు వేసుకుని బంధువులు అంతా అమ్మాయి ఇంటికి ఎంగేజ్‌మెంట్‌కు వెళతారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత బస్సు పాడవడం.. కరోనా కారణంగా లాక్‌డౌన్ రావడంతో చివరకు వాళ్లంతా అమ్మాయి ఇంట్లోనే ఉండి పోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో అర్జున్ పెళ్లికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని దాటే క్రమంలోనే అర్జున్‌కు పెద్ద షాక్ తగులుతుంది. హీరోయిన్ మాధవి తాను ఈ పెళ్లి చేసుకోనని చెపుతుంది. మరి చివరకు వీరి పెళ్లి జరిగిందా ? లేదా ? అన్నదే కథ.
విశ్లేషణ :
అసలు విశ్వక్‌సేన్‌ను ఈ తరహా పాత్రలో ముందెన్నడు చూసి ఉండం. చాలా భయస్తుడిగా, నెమ్మదస్తుడిగా, మొహమాట పడే క్యారెక్టర్‌లో విశ్వక్ నటించడం కొత్తగా అనిపిస్తుంది. 30 ఏళ్లకు పైన ఉన్నా పెళ్లికాకపోవడం.. పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని భయపడడం.. అమ్మాయి నుంచి తనకు షాక్ తగిలాక మనోవేదనకు గురయ్యే క్రమం.. ఇవన్నీ ఆ పాత్ర గ్రాఫ్ పెంచాయి.
ఫస్టాఫ్‌లో సినిమా చాలా సరదాగా సాగిపోతుంది. ఎంగేజ్మెంట్‌కోసం అబ్బాయి బంధువులు అందరూ అమ్మాయి ఇంటికి వెళ్లడం.. ఎంగేజ్మెంట్ తర్వాత లాక్‌డౌన్‌తో వాళ్లు అక్కడే ఉండిపోవాల్సి రావడం.. చిన్న చిన్న సరదాలు.. ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు సినిమా ఓ స్టైల్లో ముందుకు వెళుతుంది. నేపథ్య సంగీతం ఫీల్ కూడా ఫస్టాఫ్ బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
అయితే సెకండాఫ్‌లో కథలో అసలు మలుపు వచ్చాక బాగా స్లో అయిపోతుంది. కథనం ఒక్కోసారి ఎటు పోతుందో కూడా అర్థం కాదు. అయితే సెకండాఫ్‌లోనూ కొన్ని మంచి సీన్లు అయితే ఉన్నాయి. రెండో హీరోయిన్‌తో హీరో కొత్త ప్రేమకథలో మంచి ఫీల్ ఉన్నా మరీ స్లోగా ఉంటుంది. ఓవరాల్‌గా ఒక్కసారి చూసినా మన పైసలకు మాంచి ఎంటర్టైన్‌మెంట్ దొరుకుతుంది.
ఫైనల్ పంచ్:
అశోకవనంలో అర్జున కళ్యాణం కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్.. ఎంజాయ్‌మెంట్
అశోకవనంలో అర్జున కళ్యాణం రేటింగ్: 3 / 5