ఎన్టీఆర్ కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. టెంపర్ నుంచి మొదలు పెడితే ఆరు వరుస హిట్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరు వరుస హిట్లు అంటే మామూలు విషయం కాదు. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత వీరారాఘవ – తాజాగా త్రిబుల్ ఆర్ ఇలా ఆరు వరుస హిట్లు ఎన్టీఆర్‌కు పడ్డాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని హిట్ సినిమాలు అయినా రావచ్చు.
కానీ ఎన్టీఆర్‌కు మూతిమీద మీసాలు కూడా సరిగా రాకముందే 21 సంవత్సరాలకే స్టూడెంట్ నెంబర్ 1 – ఆది – సింహాద్రి లాంటి హిట్ సినిమాలు పడ్డాయి. ఆ సినిమాలు నిజంగా ఎన్టీఆర్‌కు కెరీర్ స్పెషల్. అందులో రెండు సినిమాలకు రాజమౌళి, ఆదికి వివి. వినాయక్ దర్శకుడు. విచిత్రం ఏంటంటే రాజమౌళి, వినాయక్ ఇద్దరి కెరీర్‌లు కూడా ఎన్టీఆర్‌తోనే స్టార్ట్ అయ్యాయి.
ఇక ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా షూటింగ్ ఫారిన్‌లో జరుగుతున్నప్పుడు అదే టైంలో నల్లములపు శ్రీనివాస్ ( బుజ్జి) నిర్మిస్తోన్న చెప్పాలని ఉంది సినిమా షూటింగ్ కూడా అదే స్పాట్‌లో జరుగుతోందట. వడ్డే నవీన్ – రాశీ జంటగా నటించిన ఈ సినిమాకు చంద్రమహేష్ దర్శకుడు. వివి. వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్. నల్లములుపు బుజ్జి ఎన్టీఆర్‌కు పరిచయం చేసుకుని సార్ మిమ్మలను నేను గతంలో కలిశాను.. నా పేరు బుజ్జి.. ఇతడు వినాయక్ .. సాగర్ గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు… మీ కోసం అద్భుతమైన కథ రెడీ చేశాడు… మీరు పర్మిషన్ ఇస్తే మీకు కథ చెపుతాడు అని చెప్పాడట.
అయితే వినాయక్‌ను చూస్తే డైరెక్టర్‌లా అనిపించలేదట ఎన్టీఆర్‌కు… ఇండియాకు వచ్చాక కూడా బుజ్జి పదే పదే ఎన్టీఆర్ ఇంటికి ఫోన్ చేస్తున్నాడట. చివరకు ఎన్టీఆర్ తల్లికి విసుగువచ్చేసి ఒరేయ్ ఎవరో బుజ్జి అటరా పదే పదే ఫోన్ చేసి విసిగించేస్తున్నాడు అని చెప్పడంతో చివరకు ఎన్టీఆర్ వాళ్లను రమ్మని కథ నచ్చలేదని చెప్పి పంపేద్దామని అనుకున్నాడట. ఇందుకు ఫారిన్‌లో వినాయక్‌ను ఇతడు డైరెక్టర్ ఏంటని అనుకోవడం.. అప్పటికి వినాయక్ ఒక్క సినిమా కూడా చేసి ఉండకపోవడంతో ఎన్టీఆర్‌కు పెద్ద అంచనాలు లేవు.
సరే ఓ రోజు కథ చెప్పడానికి ఎన్టీఆర్ వినాయక్‌ను రమ్మన్నాడు. నాకు పది నిమిషాల్లో మెయిన్ లైన్ చెప్పేయమన్నాడట. అది కూడా కథ నచ్చలేదని చెప్పి పంపేద్దామన్న ఆలోచనలోనే ఎన్టీఆర్ ఉన్నాడట. వెంటనే వినాయక్ సార్ నాకు పదినిమిషాలు టైం ఇవ్వండి.. ఇంట్రడక్షన్ మాత్రమే చెపుతాను అని ఇంట్రడక్షన్ సీన్ చెప్పగా ఎన్టీఆర్ మెస్మరైజ్ అయిపోయాడట.
ఆ తర్వాత ఇంటర్‌వెల్ బ్యాంక్… సెకండాఫ్.. క్లైమాక్స్ చెపుతూనే ఉన్నాడట. ఎన్టీఆర్ 10 నిమిషాలతో మొదలు పెట్టి మూడు గంటల పాటు ఆ స్టోరీ వింటూనే ఉన్నాడట. కథ మొత్తం చెప్పగానే ఎన్టీఆర్ వెంటనే లేచి వెళ్లి వినాయక్‌ను హత్తుకుని.. అన్నా మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాడట. అయితే అప్పుడు ఎన్టీఆర్ తో పాటు కథలు కూడా వింటోన్న ఇప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఇంత చిన్న వయస్సులోనే ఇంత పెద్ద బరువైన స్టోరీలో ఎన్టీఆర్ సెట్ అవుతాడా ? ఏదైనా లవ్‌స్టోరీ ఉంటే బాగుంటుందని చెప్పారట.
తర్వాత ఆదిలో హీరోయిన్‌కు, హీరోకు మధ్య ఓ అందమైన లవ్‌స్టోరీని సెట్ చేశారు. అలా ఆది కథను ఎన్టీఆర్ ఓకే చేయడం.. మార్చి 28, 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా చరిత్రను తిరగరాసేలా హిట్ అవ్వడంతో పాటు 98 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్టుగా ఆడడం జరిగిపోయాయి. ఒక వేళ నిజంగా ఎన్టీఆర్ ఈ కథ సరిగా వినకుండా రిజెక్ట్ చేసి ఉంటే ఓ మంచి బ్లాక్‌బస్టర్ సినిమాను మిస్ అయిపోయి ఉండేవాడు