పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా జనాలకు పూనకాలు వచ్చేస్తాయ్. పవన్ తెరమీద కనిపిస్తే చాలు కిర్రెక్కిపోయే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు అంటే పవన్ నడివయస్సు దాటేశాడు. పవన్ యూత్‌లో ఉన్నప్పుడు వరుస హిట్లతో ఎంతో మందికి ఆరాధ్యదేవుడు అయ్యాడు. తొలి సినిమాతో మొదలు పెట్టి ఖుషీ వరకు వరుస హిట్లతో దూసుకుపోయాడు. అప్పట్లో పవన్ ఏది చేస్తే అది ఓ స్టైల్.. పవన్ ఏ డ్రెస్ వేసుకుంటే అది కుర్రాళ్లు ఫాలో అయ్యేవారు.
2001లో వచ్చిన ఖుషీతో పవన్ కెరీర్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరిపోయింది. పవన్ అంటే తెలుగు నాట ఓ మానియా అయిపోయింది. పవన్ తెరమీద కనిపిస్తే చాలు కాసులు రాలిపోయేవి. ఖుషీ తర్వాత పవన్ రాంగ్ స్టెప్ వేశాడు. ఫామ్‌లో ఉన్నప్పుడు రెండేళ్ల పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే గీతా బ్యానర్లో తన సొంత డైరెక్షన్‌లో జానీ సినిమా చేశాడు. జానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చి పెట్టింది.
పవన్ తన రెమ్యునరేషన్ నుంచి ఈ సినిమా కొన్న వాళ్లకు 15 శాతం వెనక్కు ఇచ్చాడు. పవన్ స్వీయ డైరెక్షన్‌లో వచ్చిన తొలి సినిమా డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత పవన్ చాలా యేళ్ల పాటు హిట్‌కు దూరమైపోయాడు. పవన్ డైరెక్ట్ చేసిన సినిమా ఏది అంటే అందరూ జానీ పేరే చెపుతారు. అయితే పవన్ డైరెక్ట్ చేసిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ కూడా ఉంది. అది చాలా మందికి తెలియదు.
శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఏఎం. రత్నం నిర్మించిన బ్లాక్‌బస్టర్ ఖుషి. కోలీవుడ్ డైరెక్టర్ ఎస్. జె. సూర్య ఈ సినిమాకు దర్శకుడు. అయితే చాలా మందికి ఈ బ్లాక్‌బస్టర్ క్రెడిట్ సూర్యకే ఇస్తారు. ఈ సినిమాను సగం డైరెక్ట్ చేసింది పవన్ కళ్యాణే. పవన్‌కు తొలి సినిమా నుంచి తన ఫైట్లు, పాటలు చాలా వరకు డైరెక్ట్ చేసుకునే అలవాటు ఉంది. తమ్ముడు, బద్రిలో పాటలు, ఫైట్లు స్వయంగా పవనే డిజైన్ చేసుకున్నాడు.
ఖుషీలో అన్ని పాటలతో పాటు ఫైట్లను పవన్ డైరెక్ట్ చేసుకున్నాడు. కలకత్తా నేపథ్యంలో వచ్చిన సీన్లను కూడా పవనే స్వయంగా డైరెక్ట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ స్వయంగా చెప్పారు. పైగా ఈ సీన్లను పవన్ దగ్గరుండి మరీ ఎడిట్ చేయించుకున్నట్టు కూడా ఆయన చెప్పారు. అంటే ఖుషీ బ్లాక్‌బస్టర్ క్రెడిట్ సగం పవన్‌కు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే..! ఇక జానీ తర్వాత పవన్ స్వీయ దర్శకత్వంలో సత్యాగ్రాహి సినిమా స్టార్ట్ కావాల్సి ఉన్నా అది పట్టాలు ఎక్కలేదు.