ప్రముఖ యాంకర్ టీవీ వ్యాఖ్యాత సుమ కనకాల అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్‌లో హీరోయిన్గా చేసింది. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలోనే ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆమె బుల్లితెరపై తిరుగులేని క్రేజీ యాంకర్ అయిపోయింది. మళ్లీ చాలా యేళ్ల తర్వాత ఆమె జయమ్మ పంచాయితీ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. సమ్మర్ కానుకగా ఈ నెల 6న జయమ్మ పంచాయితీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇప్పటికే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌తో పాటు గొలుసు కట్టు సాంగ్ మాంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇక తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు తన విషెస్ తెలియజేశారు. పవన్ రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్లో జయమ్మ తనకు జరిగిన అన్యాయం విషయంలో గ్రామం మొత్తానికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేసిందో చూపించగా.. ఇప్పుడు ట్రైలర్ కూడా దానికి కొనసాగింపుగానే ఉంది.
తాజా ట్రైలర్లో జయమ్మ తన భర్త ఆపరేషన్ కోసం డబ్బు పోగు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలు వెతుక్కోవడం… ఆమె ప్రయత్నాలు జరగకపోవడం.. భర్త యెదవ ప్రాణాలు పోతే పోని అంటే.. చావడం సులువే కాని బ్రతికి బాధ్యత తీసుకోవడమే కష్టం అని సుమ చెప్పడం ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. అలాగే జయమ్మ ఆటోలో వెళుతున్నప్పుడు ఓ యువకుడు జయమ్మ కుమార్తెను ఫ్లర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. జయమ్మ అతడికి వార్నింగ్ ఇస్తుంది.
ఓవరాల్‌గా చూస్తే జయమ్మ పంచాయితీ ఊరి సమస్యగా ఎలా ? మారింది. ఆమే చివరకు తన సమస్యను ఎలా ? పరిష్కరించుకుంది ? ఆమె తన భర్త ఆపరేషన్ చేయించుకుందా ? లేదా ? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ జయమ్మ పంచాయితీ. రిలీజ్ ట్రైలర్లో మాంచి భావోద్వేగాలు అయితే ఉన్నాయి. జయమ్మగా సుమ మేకప్ లేకుండా చాలా నేచురల్‌గా కనిపించింది.
కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఓ జానర్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. సుమే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నారు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటర్ కాగా.. ఈ సినిమాకు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.