జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవ్వరం ఊహించలేం. చెన్నై రోడ్ల మీద తిండిలేక ఫుట్‌ఫాత్ మీద పడుకున్నానని చెప్పిన వారే ఈ రోజు స్టార్ దర్శకులు అయ్యారు. ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో స్టూడియోల వెంట తిరిగిన రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరో అవ్వడంతో పాటు మాస్ మహరాజ్ అయిపోయాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరో కావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలిసిందే. చిరు కెరీర్ స్టార్టింగ్‌లో అసలు ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో స్టూడియోల చుట్టూ తిరిగితే ఆ జుట్టు వేసుకుని ఉన్న చిరును చూసి అసలు నీకు ఎవరు ఛాన్స్ ఇస్తారు ? అని అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కట్ చేస్తే ఇప్పుడు నాలుగు దశాబ్దాలుగా చిరుయే నెంబర్ వన్ హీరో.
అయితే ఇప్పుడు బాలీవుడ్ రచయిత షాగుప్తా రఫీక్ జీవితంలో కూడా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆమె నిజ జీవితాన్నే సినిమాగా దేశం ముందుకు తీసుకు వస్తున్నారు. ఆమె జీవితం గురించి వింటేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. షాగుప్తా రఫీక్‌కు అసలు అమ్మ, నాన్న ఎవరో తెలియదు. చిన్నప్పుడే ఎవరో ఆమెను గోడ మీద వదిలేస్తే ఓ పెద్దవిడ చేరదీసి పెంచి పెద్ద చేసింది.
అయితే ఆమెకు సాయం చేసే వ్యక్తి సడెన్‌గా మృతి చెందడంతో షాగుప్తా బార్ డ్యాన్సర్‌గా మారింది. పదేళ్లు ఆమె ఆ వృత్తిలోనే ఉంది. ఆ తర్వాత ఆమె వ్యభిచారం కూడా చేసింది. అలా తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది. ఆమెలో ఓ రచయిత ఉన్న విషయం ఆమెకే ఆ తర్వాత తెలిసింది. ముందు ఆమె రచనలు ఎవ్వరూ వినిపించుకోలేదు.
అయితే కాలం కలిసొచ్చాక ఆమెను ఎవ్వరూ ఆపలేదు. ఆమె వరుసగా ఓ లాంహే ,మర్డర్ 2 ,రాజ్ 3 ,జన్నత్ 2 వంటి సినిమాలకు రచయితగా చేశారు. ఇప్పుడు ఆమె సొంత కథే సినిమాగా వస్తోంది. దీనికి మహేష్‌భట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మధ్య తరగతి మహిళలు అవసరం కోసం బార్ డ్యాన్సర్లుగా పని చేస్తారని.. అయితే అదనపు డబ్బు కోసం మామూలు మహిళలు కూడా వ్యభిచారం చేస్తారని షా గుప్తా తెలిపారు. ఈ కథ సున్నితమైన అంశాలతో కూడి ఉంటుందని కూడా ఆమె చెప్పారు.