దివంగత లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల వెంకటరామయ్య మనవడు అయిన థమన్ ఇప్పుడు సౌత్ సినీ మ్యూజికల్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం అంతా థమన్ టైం నడుస్తోంది. థమన్ పట్టిందల్లా బంగారం అవుతోంది. అసలు భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలోని సినిమాలకు సంగీతం అందిస్తూ దూసుకుపోతున్నాడు. అసలు స్టార్ హీరోలు సైతం థమన్ మాత్రమే తమ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు.
తెలుగులో ఇప్పుడు అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు వెనక్కు వెళ్లిపోతున్నారంటే థమన్ దూకుడు, క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. అసలు థమన్ నేపథ్య సంగీతంతో థియేటర్లలో సినిమాలు చూస్తోన్న ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అల వైకుంఠపురంలో సాంగ్స్ అయితే ఇప్పటకీ యూట్యూబ్‌లో రోజుకో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అఖండ బీజీఎంతో థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలతో ఎలా ఊగిపోయారో చూశాం.
ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. థమన్ చేతిలో ప్రస్తుతం గాడ్ ఫాదర్ – ఆర్సీ-15 సినిమాలు ఉన్నాయి. ఎప్పుడూ లేనట్టుగా థమన్ మొదటి సారి తన భార్య, కొడుకు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. థమన్ భార్య పేరు శ్రీ వర్థిని. ఆమె ప్లే బ్యాక్ సింగర్. ఆమెను థమన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె గతంలో మణిశర్మ – యువన్ శంకర్ రాజా దగ్గర పనిచేసింది.
ఇక థమన్ కంపోజింగ్‌లో కూడా ఆమె కొన్ని పాటలు పాడింది. అయితే తన సినిమాల ద్వారా ఆమెను ప్రమోట్ చేయడం తనకు ఇష్టం లేదని థమన్ చెప్పేశాడు. ఆమె వాయిస్ బాగుంటుంది అని దర్శక, నిర్మాతలు భావిస్తేనే ఆమెతో తాను పాటలు పాడిస్తానని చెప్పాడు. అయితే భవిష్యత్తులో తన భార్యతో కలిసి స్టేజ్ షోలు చేయాలన్న ఆలోచనతో తాను ఉన్నానని.. అయితే అంతకు ముందే ఆమె రెండు, మూడు సూపర్ హిట్ పాటలు పాడి ఉండాలన్న కండీషన్ కూడా థమన్ పెట్టాడు.
ఇక నా కొడుకు అచ్యుత్ ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడని.. నా ట్యూన్లను ముందుగా అతడే వింటాడు.. తన అభిప్రాయం చెపుతాడు.. ఇక సంగీతానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు వాడడంలో అతడికి మంచి పట్టు ఉంది… పియానోలో నాలుగో గ్రేడ్ కూడా పూర్తి చేశాడు. అతడు ఏ ప్రొఫెసన్ ఎంచుకుంటాడో ? కూడా తనకు తెలియదని చెప్పాడు.