సినిమా రంగంలో ఓ హీరో చేయాల్సిన కొన్ని సినిమాలు చివర్లో తారుమారులు జరిగి మరో హీరో చేయడం హిట్లు కొట్టడం మామూలుగా జరిగే ప్రక్రియ. అలాగే ఓ హీరో కథ నచ్చక రిజెక్ట్ చేసిన కథను మరో హీరో చేస్తే ప్లాప్ అవుతూ ఉంటుంది.తాము వదులుకున్న సినిమా హిట్ అయితే కాస్త ఫీల్ అవ్వడం.. అదే ప్లాప్ అయితే తమ జడ్జ్‌మెంట్ కరెక్ట్ అని అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున కెరీర్‌లో తిరుగులేని.. మరపురాని సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది అఖరి పోరాటం సినిమా.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకుడు. నాగార్జున, శ్రీదేవి, సుహాసిని, కైకాల సత్యనారాయణ, అమ్రిష్‌పురి తదితరులు నటించారు. ఇళయరాజా ఈ సినిమాకు స్వరాలు అందించారు. ప్రముఖ నృత్య దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్ ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయం అయ్యారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేశారు.
1988లో వచ్చిన ఈ సినిమాకు స్టార్ స్టోరీ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. వాస్తవంగా చెప్పాలంటే చిరంజీవి – కోదండ రామిరెడ్డి – యండమూరిది హిట్ కాంబినేషన్. వీరు ముగ్గురు కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే చాలు బ్లాక్‌బస్టర్ అని.. అప్పట్లోనే వీరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ రు. 5 కోట్లకు పైనే లాభాలు తెచ్చిపెట్టడం అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో ఓ సంచలనం.
ఈ క్రమంలోనే యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఆఖరి పోరాటం నవల కూడా చిరంజీవి హీరోగా తెరకెక్కాల్సిన సినిమాయే అట. అయితే అదే టైంలో కోదండ రామిరెడ్డి – చిరంజీవి కాంబోలో మరో కథతో సినిమా వస్తోంది. ఓ రోజు అశ్వనీదత్ యండమూరి ఆఫీస్‌కు వెళ్లి ఆఖరి పోరాటం కథ విన్నారట. ఇది చిరంజీవితో అనుకున్నానని ఆయన చెప్పగా.. అప్పటికే చిరు – కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో సినిమా నడుస్తుండడంతో అశ్వనీదత్ నాగార్జునతో తీసేద్దాం అన్నారట.
హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని.. హీరోయిన్‌గా ఎవరిని తీసుకుందాం అని యండమూరి అడగగా వెంటనే శ్రీదేవిని పెట్టేద్దాం అని దత్ అనేశారట. యండమూరి ఇంటికి రాఘవేంద్రరావు ఇళ్లు 5 నిమిషాల్లో వచ్చే డిస్టెన్స్‌లోనే ఉందట. వెంటనే రాఘవేంద్రరావుకు ఫోన్ చేయడం.. ఆయన వచ్చి కథ విని బాగుందని చెప్పడంతో సినిమా ఓకే అయిపోయిందట.
అలా చిరు ఖాతాలో పడాల్సిన బ్లాక్‌బస్టర్ నాగ్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆఖరి పోరాటం అప్పట్లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఇక యండమూరి నాగార్జునకు ఆఖరి పోరాటంతో పాటు విక్కీదాదా సినిమాలకు కథలు అందించారు.