సినిమా ప్రపంచంలో చాలా చిత్ర, విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఓ హీరోతో అనుకున్న సినిమా మరో హీరోతో చేయాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే హీరోల మధ్య, దర్శక, నిర్మాతల మధ్య కూడా గ్యాప్ వస్తూ ఉంటుంది. ఉదాహరణకు తమిళ్‌లో హిట్ అయిన రమణ సినిమాను ముందుగా రాజశేఖర్ రీమేక్ చేయాలనుకున్నారు. రైట్స్ విషయంలో చర్చలు జరుగుతుండగానే ఆ సినిమా తీయాలని చిరు ఫిక్స్ అవ్వడంతో ముందుగానే రీమేక్ రైట్స్ కొన్నారు.
ఆ సంఘటన వల్లే చిరు – రాజశేఖర్ గ్యాంగ్ మధ్య గ్యాప్ పెరిగింది. ఇక ఒకప్పుడు టాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా, ఎగ్జిగ్యూటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేవీబీ సత్యనారాయణ. ఈయన విక్టరీ వెంకటేష్ హీరోగా ఒకే యేడాది రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అందులో ఒకటి కొండపల్లి రాజా, మరొకటి సుందరకాండ. ఈ రెండు సినిమాల్లో సుందరకాండకు రాఘవేంద్రరావు, కొండపల్లి రాజాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.
రజనీకాంత్ తమిళ్‌లో నటించిన అన్నామలై సినిమా చూసిన నిర్మాత సత్యనారాయణ రైట్స్ తీసుకుని హైదరాబాద్ వస్తున్నారు. అదే ఫ్లైట్లో చిరంజీవి కూడా ఉండడంతో ఆయనకు కథ చెప్పడంతో ఆయన ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఆయన ఆనందంతో నేరుగా సుందరకాండ సెట్స్‌లోకి వెళ్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న హీరో వెంకటేష్ ఆ సినిమా కూడా మనమే చేద్దామన్నారు. దీంతో ఇటు వెంకీ తనకు వరుసగా రెండో సినిమాకు కూడా డేట్స్ ఇవ్వడంతో ఆనంద పడాలో ? అటు చిరును వదులుకున్నందుకు బాధ పడాలో తెలియక ఆయన డైలమాలో పడ్డారు.
ఎట్టకేలకు జరిగిన విషయాన్ని చిరుకు చెప్పి వెంకటేష్‌తోనే ఆయన కొండపల్లి రాజా తీశారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఓ నవల ఆధారంగా 1987లో హిందీలో ఉదాగస్ సినిమా తీశారు. ఆ సినిమా రీమేక్ రైట్స్ తీసుకునే రెబల్‌స్టార్ కృష్ణంరాజు తెలుగులో ప్రాణస్నేహితులు సినిమా చేశారు. ఈ సినిమాను బేస్ చేసుకునే రజనీకాంత్ అన్నామలై చేశారు.
అంటే కృష్ణంరాజు సినిమాయే అటూ ఇటూ తిరిగి మళ్లీ కొండపల్లి రాజాగా వచ్చింది. దీంతో సినిమా రిలీజ్ అయ్యాక కృష్ణంరాజు కేసు వేశారు. దాంతో నిర్మాత సత్యనారాయణ జైలుకు వెళ్లే వరకూ వెళ్లింది. అయితే ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో చివరకు రాజీ కుదిరింది. సత్యనారాయణ చాలా ఇబ్బంది పడ్డారు. అప్పట్లో ఇది టాలీవుడ్‌లో సెన్షేషనల్ న్యూస్ అయ్యింది.