మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చిరు అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు. రామ్‌చరణ్ – చిరు కలిసి నటించినా అటు కొరటాల శివ లాంటి హిట్ డైరెక్టర్ ఉన్నా కూడా ఆచార్య డిజాస్టర్ అయ్యి ఘోరంగా నిరాశపరిచింది. అయితే ఇప్పుడు చిరు లైన్లో వరుసగా సినిమాలు ఉన్నాయి.
హనుమాన్ జంక్షన్ డైరెక్టర్ మోహనరాజా దర్శకత్వంలో మల్లూవుడ్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్ షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టులో రిలీజ్‌కు రెడీగా ఉంది. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో కోలీవుడ్‌లో అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం సినిమాకు రీమేక్‌గా వస్తోన్న భోళాశంకర్ సినిమా చేస్తారు. ఈ సినిమా కూడా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీగా ఉంది.
ఆ తర్వాత బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య వస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయ్యింది. శృతీహాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా మరో కీలక పాత్రలో కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాల్తేరు వీరయ్యను సమ్మర్లో రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతోంది. ఈ మూడు సినిమాల తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేసేందుకు కూడా చిరు ప్లాన్ చేసుకున్నాడు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీ దానయ్య నిర్మించాలనుకున్న ఈ సినిమాకు వెంకీ దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వచ్చాయి. తొలుత వెంకీ చెప్పిన లైన్ చిరుకు నచ్చినా బౌండెడ్ స్క్రిఫ్ట్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చిరు చేయరని కూడా అంటున్నారు.
చిరు సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కిందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వెంకీ కుడుములకు ఇది పెద్ద షాకే అని చెప్పాలి. ఈ సినిమాకు బదులుగా చిరు సీనియర్ నటి రాధిక నిర్మించే సినిమా చేస్తారు. రాధిక కూడా చిరు తన బ్యానర్లో సినిమా చేసేందుకు ఓకే చెప్పారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.