ఓ వైపు దేశంలో మల్టీఫ్లెక్స్‌ల ట్రెండ్ పెరిగిపోతోంది. పలు సంస్థలు వచ్చే నాలుగైదేళ్లలో మల్టీఫ్లెక్స్‌ల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నాయి. ఇక తెలంగాణలో మల్టీఫ్లెక్స్‌ల్లో టిక్కెట్ రేట్లు పెరిగిపోతున్నాయని.. అసలు ఇక్కడ సినిమాలు చూడాలంటేనే భారీగా చేతిచమురు వదులుతోందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ప్రతి కొత్త సినిమా లేదా పెద్ద సినిమాలకు ప్రభుత్వాలు రేట్లు పెంచుకోవచ్చంటూ ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో మల్టీఫ్లెక్స్‌ల వాళ్ల ఆనందాలకు పట్టపగ్గాలే ఉండడం లేదు.
ఇటు డిస్ట్రిబ్యూటర్లు, మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలు సైతం ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు బాగుండడంతో హైదరాబాద్‌లో మరిన్ని మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సినీ పోలిస్, పోరమ్ మాల్, నిజాంపేట మోర్, ఏసియన్ మాల్, పీవీఆర్, సినీ ప్లానెట్, సినీ మ్యాక్స్, ఏఎంబీ మాల్ ఇలా ప్రముఖ మల్టీఫ్లెక్స్‌లు నగరంలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడు మరో రెండు కలర్ ఫుల్ మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు అవుతున్నాయి.
మామూలుగా చూస్తే హైదరాబాద్‌లో ఇప్పటికే అటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇటు కూకట్‌పల్లి ఏరియాతో పాటు నగరం అంతటా భారీ ఎత్తున సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీఫ్లెక్స్‌లు విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్న జనాలు, సినీ ప్రియులు సినిమాలు చూసేందుకు ప్రతి ప్రాంతంలోనూ థియేటర్లు ఉన్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో ఇప్పుడు మల్టీఫ్లెక్స్ స్క్రీన్లను విస్తరిస్తోన్నారు.
వచ్చే సంక్రాంతి కానుకగా అంటే 2023 సంక్రాంతికి ఒక్క హైదరాబాద్‌లో 20 కొత్త స్క్రీన్లు రెడీ కానున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓడియన్ కాంప్లెక్స్ కు ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. ఓడియన్, మినీ ఓడియన్ థియేటర్లకు సిల్వర్ జూబ్లి చరిత్ర ఉంది. నువ్వేకావాలిది ఇక్కడ ఇప్పటకీ చెక్కు చెదరని రికార్డు. ఇప్పుడు ఆ కాంప్లెక్స్‌లో ఏకంగా 9 తెరలను అందుబాటులోకి తెస్తున్నారు. అంటే ఒక్క ఓడియన్ మల్టీఫ్లెక్స్‌లోనే ఏకంగా 9 తెరలతో కూడిన ఐమ్యాక్స్ మల్టీఫ్లెక్స్ అందుబాటులోకి రానుంది.
ఇక తెలంగాణలో మణిహారంగా ఓ పెద్ద సినీ సెంటర్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంట్రలో ఏకంగా 11 స్క్రీన్లతో కూడా అతి పెద్ద మల్టీఫ్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంత భారీ నెంబర్ స్క్రీన్లతో ఇప్పటి వరకు ఏ సముదాయం కూడా తెలంగాణలో లేదు. ఏదేమైనా హైదరాబాద్ సిగలో మరో రెండు మల్టీఫ్లెక్స్‌లు మణిహారం కానున్నాయి.