Movies' జ‌యం ' సినిమా అల్లు అర్జున్ ఎందుకు చేయ‌లేదు.. తెర‌వెన‌క...

‘ జ‌యం ‘ సినిమా అల్లు అర్జున్ ఎందుకు చేయ‌లేదు.. తెర‌వెన‌క ఇంత జ‌రిగిందా…!

టాలీవుడ్ లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా గంగోత్రి సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. రేసు గుర్రం సినిమా ముందు వరకు అల్లు అర్జున్ మామూలు హీరోగా ఉండేవాడు. రేసుగుర్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అప్పటి నుంచి సినిమా సినిమాకు బ‌న్నీ దూసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో కోసం జరుగుతున్న పోటీలో ముందువరుసలో ఉన్నాడు బ‌న్నీ. పైగా ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో బన్నీకి తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది. ఇప్పటివరకు తెలుగుతో పాటు కన్నడం, మలయాళంలో బ‌న్నీ సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది.

ఇప్పుడు పుష్ప సినిమా బాలీవుడ్ లో ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రు. 100 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన జ‌యం సినిమాతో బ‌న్నీ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉందట. ఈ సినిమాతోనే యంగ్ హీరో నితిన్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. సదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో కోటి 80 లక్షల బడ్జెట్తో తెరకెక్కి… రు. 32 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్‌ వర్గాలకు షాక్ ఇచ్చింది.

అప్పట్లో యూత్ అంతా జయం సినిమా మాయ‌లో మునిగిపోయారు. తేజ తొలి రెండు సినిమాలు చిత్రం – నువ్వు-నేను సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు. నువ్వు నేను సినిమా షూటింగ్ టైమ్‌లో ఉదయ్ కిరణ్‌కు తేజ‌కు మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వీఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ మనసంతా నువ్వే సినిమా చేశాడు. ఆ సినిమా బంప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఆ తర్వాత మరోసారి వెంటనే అదే ఆదిత్య దర్శకత్వంలో శ్రీ రామ్ సినిమా చేశారు. ఈ సినిమాలోనూ నువ్వు నేను హీరోయిన్ అనిత నటించింది. ఇది జ‌యం సినిమాకు పోటీగా వ‌చ్చింది

ఉదయ్ కిరణ్, తేజ ఇద్దరు పోటాపోటీగా వారం రోజుల తేడాలో త‌మ‌ సినిమాలు రిలీజ్ చేశారు. అయితే జ‌యం సూపర్ డూపర్ హిట్ కాగా.. శ్రీరామ్ అంచనాలు అందుకోలేక యావ‌రేజ్‌గా నిలిచింది. వాస్తవంగా ఉదయ్ కిరణ్ పై కోపంతో తేజ జయం సినిమాను అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించాలని అనుకున్నారట. ఆ ఏడాది సమ్మర్లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు. తేజ జ‌యం సినిమా కథను ముందుగా అల్లు అరవింద్ కు చెప్పి… ఆ సినిమాతోనే బ‌న్నీని హీరోగా పరిచయం చేసి తన సత్తా చాటాలని అనుకున్నారు.

 

అప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బ‌న్నీని తాను హీరోగా పరిచయం చేస్తానని చెప్పడంతో పాటు ఆ సినిమా నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అర‌వింద్‌ రాఘవేంద్రరావు వైపు మొగ్గు చూపడంతో తేజ కోరిక నెరవేరలేదు. చివరకు అప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న‌ సుధాకర్ రెడ్డి తనయుడు నితిన్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. జయం సినిమాలో విలన్ గా ముందుగా ఓ బాలీవుడ్ నటుడిని అనుకున్నారు.

ఆ న‌టుడితో కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అతడి న‌ట‌న‌ నచ్చకపోవడంతో తేజ హీరో గోపీచంద్ ను జ‌యం సినిమాలో విలన్ గా తీసుకున్నారు. గోపీ తండ్రి దివంగ‌త ద‌ర్శ‌కుడు టి. కృష్ణ ద‌గ్గ‌ర కూడా తేజ ప‌నిచేశారు. జ‌యంలో గోపీ విల‌నిజం ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండ‌డంతో పాటు హైలెట్ అయ్యింది. ఓవ‌రాల్‌గా బన్నీ చేయాల్సిన జయం సినిమా నితిన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news