ఆ హీరో టాలీవుడ్లో చాలా స్పీడ్‌గా సినిమాలు తీస్తాడన్న పేరుంది. చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు. సక్సెస్‌లు ఎక్కువే ఉన్నా ఎందుకో గాని ఇంకా టైర్ 2 రేంజ్ హీరోగానే మిగిలిపోతున్నాడు.. పెద్ద స్టార్డమ్ అయితే రావడం లేదు. ఇటీవల వచ్చిన ఓ సక్సెస్‌తో తన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేశాడు. అయితే ఇప్పుడా హీరో ఓ సినిమా విషయంలో పెద్ద డైలమాలో పడిపోయాడు. డబ్బుల్లేక ఆ సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది.
సదరు హీరో ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల మరో పెద్ద హీరోతో ఘనంగా ఆ సినిమా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయించాడు. అంతా ఓకే అనుకున్నారు. చివరకు నిర్మాత చేతులు ఎత్తేశాడు. తనకు ఫైనాన్షియర్లు డబ్బులు ఇవ్వడం లేదని.. సినిమాను తాను ఫినిష్ చేయలేనని చెప్పేసి చేతులు దులిపేసుకున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది.
ఇంకేముంది… సినిమా షూటింగ్ కంప్లీట్ కాకపోతే హీరో సినిమా ఆగిందని ఇండస్ట్రీ అంతా ఒక్కటే టాం టాం వేస్తారు. చివరకు ఆ హీరో గారే రంగంలోకి దిగి ఆ సినిమాను తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. మిగిలిన 20 శాతం షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రీగా రిలీజ్ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. ఈ 20 శాతం షూటింగ్ పూర్తి చేసేందుకు పెట్టుబడిదారుల కోసం వేట మొదలు పెట్టేశాడు.
తనకు బాగా తెలిసిన సౌండ్ పార్టీలకు ఫోన్లు చేస్తూ పెట్టుబడి పెట్టండి… వడ్డీకి అప్పు ఇవ్వండి అని వేడుకుంటున్నాడట. వాస్తవంగా చూస్తే ఓ సినిమా ఆగిపోతే అసలు ఆ హీరోకు సంబంధం లేదు. పెద్ద హీరోల సినిమాలు ఆగితేనే వాళ్లు అస్సలు పట్టించుకోరు. అయితే ఈ హీరో గారు మాత్రం తన సినిమా మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. అందుకే తానే స్వయంగా దగ్గరుండి మరీ ఇన్వెస్టర్లను వేడుకుంటోన్న పరిస్థితి.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఫైనాన్షియర్లు లేరంటూ ఆ హీరోకు చెప్పి.. ఆ సినిమాను మధ్యలోనే ఆపేసిన ఆ నిర్మాత.. ఇప్పుడు మరో కొత్త హీరోతో మరో సినిమా స్టార్ట్ చేశాడు. దీనిని బట్టి చూస్తుంటే ఆ నిర్మాతకు, ఈ హీరోకు వ్యవహారం ఏదో చెడిందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.