ReviewsTL రివ్యూ: గ‌ని

TL రివ్యూ: గ‌ని

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ – సాయి మంజ్రేక‌ర్ ( బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ కుమార్తె) జంట‌గా న‌టించిన గ‌ని సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు రెండు కొత్త అంశాలు ఉన్నాయి. అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాత‌గా మారి తెర‌కెక్కించ‌డం, కిర‌ణ్ కొర్ర‌పాటి అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేయ‌డం. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఎలా ఉందో TL సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
గని (వరుణ్ తేజ్) బాక్సర్ అయిన తన తండ్రి విక్ర‌మాదిత్య డోపింగ్‌కు పాల్ప‌డి త‌మ కుటుంబం ప‌రువు తీశాడ‌ని.. ఆయ‌న మీదే క‌క్ష పెంచుకుని ఉంటాడు. జీవితంలో ఎప్పుడూ బాక్సింగ్ జోలికే వెళ్ల‌న‌ని త‌ల్లి న‌దియాకు మాట ఇస్తాడు. అలాంటి వ్య‌క్తి పోయిన త‌న కుటుంబం గౌర‌వం కాపాడేందుకు చివ‌ర‌కు అదే బాక్సింగ్‌ను మార్గంగా ఎంచుకుంటాడు. అలాంటి గ‌నికి త‌న తండ్రి గురించి తెలిసిన నిజం ఏంటి ? ఈ క‌థ‌కు సాయి మంజ్రేక‌ర్‌తో అత‌డి ప్రేమాయ‌ణం ఏంటి ? సునీల్ శెట్టి, జ‌గ‌ప‌తిబాబు, ఉపేంద్ర‌, న‌రేష్‌ల‌కు ఈ క‌థ‌తో ఉన్న లింక్ ఏంట‌న్న‌దే ఈ సినిమా స్టోరీ.

TL విశ్లేష‌ణ :
స్పోర్ట్స్ నేప‌థ్యం ఉన్న సినిమాల‌కు ఎమోష‌న్ ముఖ్యం. గ‌తంలో వ‌చ్చిన సినిమాలు హిట్ అవ్వ‌డానికి అక్క‌డ ఎమోష‌న్ పండ‌డ‌మే. అసలు హీరో బాక్సింగ్ చేయ‌న‌ని.. తిరిగి అదే బాక్సింగ్ ల‌క్ష్యంగా ఎంచుకోవ‌డానికి చాలా సింపుల్ పాయింట్ ఉంటుంది. ఇక సినిమాకు కీల‌క‌మైన ఫ్లాష్‌బ్యాక్ ప‌ర‌మ రొటీన్ అయిపోయింది. తెలుగులో గ‌తంలో త‌మ్ముడు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాలు బాక్సింగ్ నేప‌థ్యంలోనే వ‌చ్చాయి. అయితే ఆ సినిమాల్లో ఎమోష‌న్లు, సెంటిమెంట్‌, కామెడీ అన్ని స‌మ‌పాళ్ల‌లో ఉన్నాయి. అన్నింటికి మించి ఆ సినిమాల్లో ఆట ఓ పాయింట్‌… కానీ గ‌ని కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా. అయితే సినిమాలో ఎమోష‌న్లు పండ‌లేదు.

కిర‌ణ్ కొర్ర‌పాటి కొత్త ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఖ‌చ్చితంగా క‌సిమీద ఉంటాడ‌ని.. కొత్తద‌నం చూపిస్తాడ‌ని అనుకుంటాం. కానీ ఫ‌స్టాఫ్‌లో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ వ‌ర‌కు ఏం ఉండ‌దు. ఇలాంటి ప్లాష్‌బ్యాక్‌కు ఉపేంద్ర లాంటి న‌టుడు అవ‌స‌ర‌మా ? అనిపిస్తాడు. ఇక బాక్సింగ్ ఆడ‌న‌ని త‌ల్లికి మాట ఇచ్చి తిరిగి ఆ త‌ల్లికే తెలియ‌కుండా ఓ ల‌క్ష్యం కోసం బాక్సింగ్ ఆడుతున్న విధానం విన‌డానికి బాగున్నా తెర‌మీద ఆస‌క్తిగా లేదు.

బాక్సింగ్ సీన్లే ఆస‌క్తిగా లేవు అనుకుంటే ఓ ప్రేమ క‌థ బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్టుగా ఉంది. ఇక త‌ల్లితో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లు కూడా పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు. సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక ఫ్లాష్‌బ్యాక్‌లో తండ్రి గురించి తాను అపార్థం చేసుకున్నాన‌ని భావించి.. తిరిగి ల‌క్ష్యం కోసం శ్ర‌మించి గోల్ రిచ్ అయ్యే ద‌గ్గ‌రే సినిమాపై కాస్త ఆస‌క్తి క‌లుగుతుంది. బాక్సింగ్ లీగ్ జ‌రుగుతుండ‌గా.. దానికి బెట్టింగ్ మాఫియాకు లింక్ పెట్టి న‌డిపించే సీన్లు కాస్త ఇంట్ర‌స్టింగ్ అనిపిస్తాయి.

ఎంత క్లైమాక్స్ బాగున్నా… ఆఖ‌ర్లో ఎంత క‌ష్ట‌ప‌డినా.. అప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన న‌ష్టాన్ని అది పూడ్చుతుందా ? అన్న సందేహ‌మే మిగులుతుంది. ఓవ‌రాల్గా సిన్సియ‌ర్ స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ సినిమాలో అటు ఈ ఎమోష‌నూ పండ‌క‌.. అటు క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేక అలా మిగిలిపోయింది గ‌ని. వ‌రుణ్‌తేజ్ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. బాక్సర్‌గా లుక్స్‌లో మెప్పించాడు. ఈ పాత్ర‌లోకి అంత ఈజీగా రాలేదు. కానీ వ‌రుణ్ ప‌డిన క‌ష్టం తెర‌మీద క‌నిపిస్తుంది.

సాయి మంజ్రేక‌ర్ ఎప్పుడు క‌నిపించినా ఎంత త్వ‌ర‌గా ఈ సీన్ అయిపోతుందా ? అనిపించేలా ఆమె పాత్ర ఉంది. ఉపేంద్ర సినిమాకు హైలెట్ అయినా ఆ పాత్ర‌ను బ‌లంగా తీర్చిదిద్ద‌లేదు. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి – వరుణ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. త‌ల్లి న‌దియాతో అంత బ‌ల‌మైన సీన్లు, ఎమోష‌న్ కుద‌ర‌లేదు. జ‌గ‌ప‌తిబాబు, న‌వీన్ చంద్ర పాత్ర‌ల వ‌ర‌కు ఓకే..!

టెక్నిక‌ల్‌గా థ‌మ‌న్‌పై ఉన్న అంచ‌నాల‌తో పోలిస్తే అత‌డి ఫాంకు త‌గిన‌ట్టుగా సంగీతం లేదు. ఓ పాట, నేప‌థ్య సంగీతం మిన‌హా మిగిలిన పాట‌లు గుర్తుండ‌వు. సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్‌, నిర్మాణ విలువ‌లు గుడ్‌.
అబ్బూరి ర‌వి మాట‌లు బాగున్నా సీన్లు ఎలివేష‌న్ లేక తేలిపోయాయి. ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి టేకింగ్ ప‌రంగా, ద‌ర్శ‌కుడిగా కొన్ని మంచి మార్కులు వేయించుకున్నా.. ర‌చ‌యిత‌గా ఫెయిల్ అయ్యాడు. అస‌లు స్క్రిఫ్టే ఈ సినిమాకు మైన‌స్ అయ్యింది. కొత్త ద‌ర్శం ద‌ర్శ‌కుడిగా కిర‌ణ్ కొత్త‌ద‌నం కంటే రొటీన్ క‌థ‌నే న‌మ్మ‌కుని ఆడిన ఆట అంత మెప్పించ‌దు.

ఫైన‌ల్‌గా…
బాక్సింగ్‌లో పంచ్ మిస్ అయిన గ‌ని

TL గ‌ని రేటింగ్‌: 2.25 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news