టాలీవుడ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ టైంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువుగా వచ్చేవి. అప్పట్లో ఆ హీరోల అభిమానుల మధ్య ఎంత ప్రచ్ఛన్నయుద్ధాలు జరిగినా కూడా హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేవారు కాదు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పంతాలు, పట్టింపులకు పోకుండా మల్టీస్టారర్లలో నటించేవారు. ఆ తర్వాత 1990వ దశకంలో హీరోలు, హీరోల అభిమానుల మధ్య ఉన్న తీవ్రమైన పోటీ, యుద్ధాల కారణంగా మల్టీస్టారర్ సినిమాలు అస్సలు రాలేదు.
ఏ ఇద్దరు హీరోలు కలిసి నటించినా ప్రేక్షకులు.. ముఖ్యంగా వారి అభిమానులు ఒప్పుకునేవారు కాదు. అయితే రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, వేణు, జగపతిబాబు లాంటి మీడియం రేంజ్ హీరోలు మాత్రమే కలిసి సినిమాలు చేసేవారు. అయితే గత పదేళ్ల నుంచి మాత్రం ట్రెండ్ మారింది. ముఖ్యంగా సీనియర్ హీరో వెంకటేష్ ఎక్కువుగా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – నాగచైనత్య – రామ్ – వరుణ్ తేజ్ లాంటి కుర్ర హీరోలతో ఆయన కలిసి నటిస్తూ హిట్లు కొడుతున్నారు.
ఇక తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాలో రెండు వేర్వేరు కాంపౌండ్‌లకు చెందిన హీరోలు ఎన్టీఆర్ – రామ్‌చరణ్ మల్టీస్టారర్ చేసి ఏకంగా నేషనల్ వైడ్ హిట్ కొట్టేశారు. ఇక నందమూరి కాంపౌండ్‌లో మల్టీస్టారర్ సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు.. తెలుగు సినిమా అభిమానులు అందరూ ఎంతో ఎగ్జైట్‌మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ – కళ్యాణ్‌రామ్ కాంబినేషన్లో గతంలోనే ఓ సినిమా రావాల్సి ఉంది. ఆ సినిమా మిస్ అయ్యింది.
వంశీ పైడిపల్లి.. ఎన్టీఆర్‌కు మంచి ఫ్రెండ్. వంశీకి మున్నా లాంటి ప్లాప్ సినిమా తర్వాత ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వకపోతే ఎన్టీఆర్ ఎంతో నమ్మకంతో పిలిచి మరీ బృందావనం ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ – అల్లు అర్జున్ కాంబోలో వంశీ తెరకెక్కించిన ఎవడు సినిమా స్టోరీని ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కాంబోలోనే తెరకెక్కించాలని ముందుగా వంశీ అనుకున్నాడు. అయితే ఈ కథపై ఎన్టీఆర్‌కు కొన్ని డౌట్లు ఉండడంతో కార్యరూపం దాల్చలేదు.
ఆ తర్వాత అదే కథను వంశీ చెర్రీ – బన్నీకి చెప్పి ఒప్పించుకుని ఎవడు సినిమా తీశాడు. సినిమా రొటీన్ ఫార్మాట్‌లోననే ఉన్నా.. 2014 సంక్రాంతి కానుకగా రావడం.. అదే టైంలో భారీ అంచనాలతో వచ్చిన మహేష్‌బాబు వన్ సినిమా ప్లాప్ అవ్వడంతో ఎవడు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా పాస్ అయిపోయింది. ఒకవేళ ఎన్టీఆర్ ఓకే చేసి ఉంటే అప్పుడే ఎన్టీఆర్ – కళ్యాణ్‌రామ్ కాంబినేషన్ సెట్ అయ్యి ఉండేది.