ఓ పదేళ్ల క్రితం థమన్‌ను పెద్దగా స్టార్ హీరోలు ఎవ్వరూ పట్టించుకునే వారే కాదు. అప్పుడు అంతా రాక్‌స్టార్ దేవిశ్రీ హవాయే టాలీవుడ్‌లో కొనసాగేది. కొందరు స్టార్ హీరోలు ఒక్కోసారి హరీష్ జైరాజ్, అనిరుధ్, ఏఆర్. రెహ్మన్ లాంటి వాళ్లను పెట్టుకునే వారు. థమన్‌కు ఛాన్సులు ఇచ్చినా అనేకానేక కాపీ పాటలని… తుప్పు ఆర్ ఆర్ అని వంకలు పెట్టేసేవారు. పైగా థమన్‌కు కాపీ క్యాట్ అన్న ముద్ర పడిపోయింది. స్టార్ హీరోలు కూడా పెద్దగా పట్టించుకునే వారే కాదు. విచిత్రం ఏంటంటే ఓ పెద్ద హీరో ప్రతిష్టాత్మక సినిమాకు దేవీశ్రీకి పిలిచి ఛాన్స్ ఇచ్చినా మ్యూజిక్ ఇవ్వడం లేదు.
చివరకు వాళ్లకు విసుగు వచ్చేసి బాలీవుడ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌ను తెచ్చుకున్నారు. అంతలా దేవిశ్రీ ఉండేవాడు. అయితే కాలం తిరగబడడానికి ఎంతో టైం పట్టదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోలు అందరూ థమన్ వెంట పడుతున్నారు. విజయ్…ప్రభాస్.. థమన్..మహేష్..చరణ్..పవన్..బాలయ్య..రవితేజ..ఇలా హీరో ఎవరైనా, బ్యానర్ ఏదైనా సినిమాలు అన్నీ థమన్ చేతుల్లోనే ఉన్నాయి.
ఎంత పెద్ద డైరెక్టర్ అయినా.. పెద్ద హీరో అయినా.. పెద్ద బ్యానర్ అయినా అన్నీ ప్రాజెక్టులు థమన్‌కే. ఇక రాజమౌళికి అంటే కీరవాణి ఎలాగూ ఉన్నారు. పెద్ద డైరెక్టర్లలో ఒక్క సుకుమార్ మాత్రమే దేవిశ్రీని నమ్ముకున్నట్టు ఉన్నారు. థమన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నోట్లో నానుతోంది. ఎవరి నోట విన్నా థమనే కావాలంటున్నారు. థమన్ విజయ రహస్యం ఏంటన్నది చూస్తే చాలా కారణాలే కనిపిస్తాయ్.
థమన్ పడే తపన అంతా ఇంతా కాదట. ఓ సినిమాకు రు. 50 లక్షలు ఇస్తామన్నా.. మరో సినిమాకు రు. 3 కోట్లు ఇస్తామన్న ఒకేలా ప్రాణం పెట్టి.. అంత ఎఫర్ట్ పెట్టి పనిచేస్తాడంటున్నారు. ఓ సినిమాకు రు. 3 కోట్లు ఇస్తే ఏదో నాలుగు ట్యూన్లు వాళ్ల మొఖాన కొట్టేసి చేతులు దులిపేసుకోసుకోడు. ఆ డబ్బుల్లో చాలా వరకు మ్యూజిక్ మీదే పెట్టేస్తాడు. క్వాలిటీ కోసం ఎంతో మంది మ్యూజిషియన్లను తీసుకువస్తాడు. క్వాలిటీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేసి రాజీపడడు అన్న పేరు తెచ్చుకున్నాడు.
చివరకు థమన్ కవర్ సాంగ్‌లకు, లిరికల్ వీడియో సాంగ్‌లకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. అవి భారతదేశ సినీ చరిత్ర రికార్డులను తిరగరాస్తున్నాయి. బన్నీ అల వైకుంఠపురంలో సాంగ్సే ఇందుకు పెద్ద ఉదాహరణ. చివరకు ఓ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టిందంటే థమన్ మ్యూజిక్ పాత్ర పావు వంతుకు పైగానే.. కొన్ని సినిమాలకు సగం అన్న పేరు తెచ్చేసుకున్నాడు. రిలీజ్‌కు ముందు రిలీజ్ తర్వాత యూట్యూబులు, సోషల్ మీడియాల్లో లక్షల్లో లైకులు వచ్చే టెక్నిక్ మనోడు కనిపెట్టేశాడు. ఇప్పుడు ఈ విషయంలో మనోడిని అందుకునే వాళ్లే లేరు.
ఇక ఆడియో ఫంక్షన్ అంటే ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోడు. అందరిని పొగిడేసి జిమ్మిక్కులు చేయడు. స్టేజ్ మీద లైవ్ పెర్పామెన్స్‌లతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేస్తాడు. పెద్ద సినిమాలు తన చేతిలో ఉన్నాయని.. మీడియం రేంజ్ సినిమాలను కూడా వదులుకోడు. రెండు సినిమాలకు ఒకేలా పని చేస్తాడు. అందుకే ఇండస్ట్రీలో థమన్‌ను ఇప్పుడు అందరూ అక్కున చేర్చేసుకుంటున్నారు.
గతంలో థమన్‌ను కాదనుకున్న పెద్ద స్టార్లు కూడా ఇప్పుడు థమనే కావాలని పట్టుబడుతున్నారు. ఇక్కడ దేవిశ్రీని తక్కువ చేసి చూపడం అని కాదు కాని.. పదేళ్ల క్రితం థమన్‌తో పోలిస్తే ఎంతో ఎత్తులో ఉన్నోడు ఈ రోజు అనేకానేక కారణాలతో థమన్ ముందు ఎందుకు సరితూగే పరిస్థితి లేదు. అసలు ఇప్పట్లో థమన్‌కు బ్రేకులు వేసేవారే టాలీవుడ్‌లో కనపడడం లేదు.