టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తెలుగు సినిమా పరిశ్రమలో అందరికీ ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ ముందు నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఫ్యామిలీ పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎన్టీఆర్‌కు కష్టసుఖాల విలువ ఏంటో తెలుస్తుందని చాలామంది అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే దర్శకులతో నిర్మాతలతో ఎంతో సన్నిహితంగా ఉంటూ ఎన్టీఆర్ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి వల్ల ఎన్టీఆర్‌కు తనకు మధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చిందని ఓ సీనియర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆవుల గిరి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఒకప్పుడు నైజాంలో ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి – బాలయ్య బ్లాక్బస్టర్ నరసింహ నాయుడు సినిమాలు ఆయన పంపిణీ చేశారు. నైజాంలో గిరి ఒక సినిమా పంపిణీ చేస్తున్నారు అంటే అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి. అలా డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న ఆవుల గిరి ఆ తర్వాత నిర్మాతగా మారారు. నిర్మాతగా మారి కొన్ని సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నారు.
అయితే సుకుమార్ అనే వ్యక్తి వల్ల ఎన్టీఆర్‌కు తనకు మధ్య గ్యాప్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు గిరి. సుకుమార్ అంటే డైరెక్టర్ సుకుమార్ కాదు అప్పట్లో సుకుమార్ ఎన్టీఆర్‌కు మేనేజర్‌గా పనిచేసేవారట.
ఎన్టీఆర్ హీరోగా అవుల గిరి నిర్మాతగా ముళ్లపూడి వర దర్శకత్వంలో నా అల్లుడు సినిమా వచ్చింది. 2005 సంక్రాంతి కానుకగా వచ్చిన నా అల్లుడు సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీయ, జెలీలియా హీరోయిన్లుగా నటించారు.
నా అల్లుడు సినిమా తర్వాత గిరి మరో సినిమా చేయలేదు. అందుకు గల కారణాలను కూడా ఆయన తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్టీఆర్‌కు మేనేజర్గా పని చేసిన సుకుమార్ తనను మానసికంగా ఎంతో టార్చర్ పెట్టాడని… ఒకసారి అతడి గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ కూడా అయిందని చెప్పారు. తనకు సినిమా పరిశ్రమపై విరక్తి కలగడానికి కూడా సుకుమారే కారణమని గిరి వాపోయారు.
సుకుమార్ తారక్ కు తనకు… అలాగే కొడాలి నానిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు అని ఎన్టీఆర్‌ను ఎవరితోనూ కలవనిచ్చేవాడు కాదన్నారు. నిజం తెలిశాక అందరూ కలిసి సుకుమార్ ను పిచ్చకొట్టుడు కొట్టారు అంటూ చెప్పారు. అయితే ఆ తర్వాత నిజం తెలుసుకున్న ఎన్టీఆర్ తను స్వయంగా పిలిపించుకుని మాట్లాడినట్టు కూడా గిరి తెలిపాడు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో మేనేజర్ల వల్ల హీరోలు చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటిలో సుకుమార్ – ఎన్టీఆర్ ఉదంతం కూడా ఒకటి అని అర్థం అవుతోంది.