దివంగత వర్థమాన హీరో ఉదయ్‌కిరణ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా చిన్న వయస్సులో కెరీర్ స్టార్టింగ్‌లోనూ మూడు వరుస హిట్లతో అప్పట్లో స్టార్ హీరోలకే చెమటలు పట్టించేశాడు ఉదయ్ కిరణ్. తొలి సినిమా చిత్రం హిట్.. నువ్వు నేను బ్లాక్‌బస్టర్.. మనసంతా నువ్వే అంతకుమించి హిట్.. నాలుగో సినిమా శ్రీరామ్ కూడా యావరేజ్. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. చివరకు కెరీర్‌లో పాతాళానికి పడిపోయి తన ప్రాణమే తీసుకున్నాడు.
ఇదంతా గతం.. ఉదయ్ కిరణ్ – తేజ కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. ఉదయ్ కిరణ్ తొలి సినిమా చిత్రం. ఆ తర్వాత రెండో సినిమా నువ్వు నేనుకు కూడా తేజయే దర్శకుడు. ఆ తర్వాత ఇద్దరూ ప్లాపుల్లో ఉన్నప్పుడు ఔనన్నా..కాదన్నా చేశారు. అది వేరే సంగతి. చిత్రం సినిమా హిట్టయ్యాక దర్శకుడిగా తేజకు వరుస ఆఫర్లు వచ్చాయి. అటు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, ఇటు హీరోయిన్ రిమాసేస్ అంతా బిజీ అయ్యారట.
అయితే ఉదయ్‌కిరణ్ సన్నగా ఉండడంతో నిర్మాతలకు సరిగా ఆనేవాడు కాదట. ఈ హీరోకు వచ్చిన హిట్ గాలివాటం అని.. ఇతడితో మనం సినిమా ఎలా ? తీస్తామని అనుకునేవారట. చిత్రం హిట్ అయ్యాక కూడా ఉదయ్ కిరణ్ తేజ ఆఫీస్‌కు వచ్చి అక్కడే కింద కూర్చునే వాడట. ఇక తేజ నువ్వు నేను సినిమా తీయాలని డిసైడ్ అయ్యారట. జెమినీ ఆర్ట్స్ అధినేత కిరణ్ నిర్మాతగా ఈ సినిమా ప్లాన్ చేశారు.
అప్పుడు తెలుగులో కూడా మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో మాధవన్‌తో తేజ మాట్లాడారు అట. ఈ సినిమా చేయమని అడిగితే.. తాను తెలుగు సినిమాలు చేయనని చెప్పేశారట. దీంతో ఎవరిని పెట్టుకోవాలా ? అని డిస్కర్షన్లు నడుస్తున్నప్పుడు తేజ మళ్లీ ఉదయ్‌కిరణ్ వైపే మొగ్గు చూపారట. అప్పటి వరకు కింద కూర్చొన్న ఉదయ్‌ను లేచి పైన కూర్చోవయ్యా.. నువ్వే నా సెకండ్ సినిమా హీరోవి కూడా అని చెప్పేశారట.
అలా నువ్వు నేనుకు అనుకోకుండా ఉదయ్ కిరణ్‌ను హీరోగా సెలక్ట్ చేశామని.. నిర్మాత జెమినీ కిరణ్ ఇతడేం హీరో అన్నా కూడా ఉదయ్‌నే పెట్టుకున్నామని తేజ చెప్పారు. ఇక ఈ సినిమా హీరోయిన్‌గా అనితను కూడా డిఫరెంట్‌గా సెలక్ట్ చేసినట్టు తేజ చెప్పారు. ముందుగా ఐదారుగురు హీరోయిన్లను టెస్టింగ్ కు పిలిచి.. ఓ ముంబై అమ్మాయిని సెలక్ట్ చేశారట.
అయితే ఆ హీరోయిన్ షూటింగ్‌కు వచ్చినప్పుడల్లా మూడు, నాలుగు బిజినెస్ క్లాస్ టిక్కెట్లతో పాటు ఫైవ్‌స్టార్ హోటల్లో రెండు రూమ్‌లు బుక్ చేయడంతో పాటు హై రెమ్యునరేషన్ కావాలని కండీషన్ పెట్టిందట. వెంటనే తేజ ఇక్కడ హీరోయిన్ సెలక్షన్‌కు వచ్చినోళ్లలో నీకు ఎవరు బాగున్నారు. ఎవరు బాగోలేదని అడిగారట. ఆ ముంబై భామ అనితను తనకు ఏ మాత్రం నచ్చలేదని చెప్పిందట. వెంటనే తేజ అయితే ఆమే నా సినిమా హీరోయిన్ అని చెప్పి ముంబై భామను పంపేశారట. అది సంగతి..!