నందమూరి నటసింహం బాలకృష్ణ నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య హీరోగా కొనసాగటం ఒక ఎత్తు అయితే అన్ని రకాల పాత్రల్లో నటించి అభిమానులను అలరించడం మరో ఎత్తు. పౌరాణికం – సాంఘికం – చారిత్రకం – ఫ్యాక్షనిజం ఇలా ఏ పాత్రలో అయినా ఒదిగి పోగల నటుడు బాలయ్య. ఈతరం జనరేషన్ హీరోలలో బాలయ్యలా పౌరాణిక పాత్రలు చేయటం ఏ హీరోకి సాధ్యం కాదని చెప్పాలి.
తండ్రి నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని బాలయ్య చిన్నవయసులోనే పౌరాణిక పాత్రల్లో నటించారు. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాత్మక సినిమాలో శాతకర్ణిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. తాజాగా అఖండ సినిమాలో అఘోరాగా నటించి… ఈ పాత్ర బాలయ్య మినహా మరే హీరో చేయలేడన్నట్టుగా శభాష్ బాలయ్య అనిపించుకున్నాడు. తాజాగా సీనియర్ హీరో సురేష్ బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తనకు బాలకృష్ణను చూసినప్పుడల్లా సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని… ఆ నట వారసత్వాన్ని బాలయ్య అలా అందిపుచ్చుకున్నాడు అని… బాలయ్యతో ఏదో తెలియని ఆత్మీయ అనుబంధం ఎప్పుడూ ఉంటుందని సురేష్ తెలిపారు. సురేష్ తండ్రి చంద్రశేఖర్ దర్శక నిర్మాత, రచయిత. ఆయన సీనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమాలు తెరకెక్కించారు. ఆయన వారసుడిగా సురేష్ సినిమాల్లోకి వచ్చారు. కొద్ది సంవత్సరాల క్రితం బాలయ్యతో తాను శ్రీమన్నారాయణ సినిమాలో కలిసి నటించాను అని… బాలయ్యతో వర్క్ చేయటం ఎంతో బాగుంటుందని కూడా సురేష్ చెప్పారు.
పౌరాణిక సినిమాలు చేయాలన్నా.. చారిత్రాత్మక సినిమాలు చేయాలన్నా ఇప్పుడున్న హీరోలలో బాలయ్య తర్వాతే ఎవరైనా అని సురేష్ కుండ బద్దలు కొట్టారు. తండ్రి ఎన్టీఆర్ లాగా బాలయ్యలోనూ ఓ కథకుడు, ఒక డైరెక్టర్, ఒక రైటర్, ఒక నిర్మాత కూడా ఉన్నారన్న విషయాన్ని సురేష్ చెప్పారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ 360 డిగ్రీస్ ఆల్‌రౌండర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు.
జూనియర్ ఎన్టీఆర్ తనను సార్… అండి అని పిలవడం ఇష్టం ఉండదు అని.. తాను అతడిని చీప్ పిలుస్తానని.. తనని కూడా అలాగే చీప్ అని పిలవమని అంటానని సురేష్ తెలిపారు. ఇక సురేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నాడు.